పోర్టులో అమెరికా కాన్సులేట్ జనరల్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)ని గురువారం సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దూబే, పోర్టు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో ఆధునిక మౌలికవసతులు, సముద్ర వాణిజ్యంలో విశాఖపట్నం పోర్టు పోషిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలను పోర్టు అధికారులు కాన్సులేట్ జనరల్‌కు వివరించారు. సరుకు నిర్వహణా సామర్థ్యం, పోర్టులో కొనసాగుతున్న ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులు, పోర్టు కార్యనిర్వహణా సామర్థ్యాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కవర్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ఆమె పరిశీలించారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు వంటి గ్రీన్ పోర్టు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఏయూతో అనుబంధం
మరింత బలోపేతం కావాలి
మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అమెరికన్ కాన్సులేట్ అనుబంధం మరింత బలోపేతం కావాలని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆమె ఏయూని సందర్శించి వీసీ ఆచార్య రాజశేఖర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ స్వయంగా కొన్ని కార్యక్రమాలను అమెరికన్ కార్నర్‌తో కలిసి నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. నోబెల్ గ్రహీతలను ఏయూకు ఆహ్వానిస్తామని, దీనికి సహకారం అందించాలన్నారు. ఫుల్ బ్రైట్ స్కాలర్స్‌ను కొంత కాలం ఏయూలో ఉండే విధంగా ఆహ్వానిస్తామన్నారు. వీరిని ఏయూతో అనుసంధానం చేయాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అమెరికన్ కార్నర్ సమన్వయకర్త ఆచార్య పాల్ డగ్లస్ పాల్గొన్నారు.


