సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి జీవీఎంసీ కమిషనర్ ఆదేశం
ఆరిలోవ: నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ముడసర్లోవతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ముడసర్లోవ పార్కు పరిసరాలు, సాగర్ నగర్ సమీపంలోని రాడిసన్ బ్లూ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ముడసర్లోవ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఆకర్షణీయమైన సైకిల్ ట్రాక్ నిర్మించాలని అలాగే రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సాగర్ నగర్ బీచ్ వరకు మరో ట్రాక్ ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజును ఆదేశించారు. సైకిల్ ట్రాక్ లతో పాటు బీచ్ రోడ్డులోని టీయూ 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సమీపంలో సుమారు 75 నుంచి 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం మధురవాడ ప్రాంతంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ ఏడుకొండలు ఏపీయూఐఎల్ రీజినల్ హెడ్ చేతన్, సహాయక ఇంజినీర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


