జగన్‌కు ఇచ్చిన మాట
గత ప్రభుత్వ హయాంలో
ఇనార్బిట్‌మాల్‌కు శంకుస్థాపన
2023 ఆగస్ట్ 1న జరిగిన
కార్యక్రమానికి నాటి సీఎం జగన్ హాజరు
అప్పుడే రెండో దశ పెట్టుబడులపై
నీల్ రహేజా హామీ
ఈ మేరకు రూ.2,172.26 కోట్ల
పెట్టుబడికి ఆసక్తి వ్యక్తీకరణ
9,681 మందికి ఉద్యోగావకాశాలు
కల్పించేందుకు ప్రణాళికలు
విశాఖలో రెండో విడత పెట్టుబడులకు ‘రహేజా’ సంసిద్ధత
సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇన్ఫినిటీ రూమ్స్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఫలాలను అందిస్తున్నాయి. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన, దక్షిణాదిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఇనార్బిట్‌మాల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటోంది. విశాఖలోనే రెండో దశలో ఐటీ బిజినెస్ పార్క్ అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని కార్యరూపం దాల్చే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. రూ.2,172.26 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రహేజా కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తయితే 9,681 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
తుది దశకు చేరుకున్న దక్షిణాదిలోనే
అతిపెద్ద మాల్ పనులు
2023 ఆగస్ట్ 1న సాలిగ్రామపురంలో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–1లో భాగంగా ఇనార్బిట్ మాల్, ఐటీ పార్క్ నిర్మాణానికి రహేజా గ్రూప్ రూ.600 కోట్లు వ్యయం చేస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మిస్తోంది. 2026 నాటికి దీన్ని పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 80 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి. ఇందులో 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్లు, మల్టీఫ్లెక్స్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్ అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కలగనుంది. ఈ నిర్మాణాలన్నీ ‘గ్రీన్ బిల్డింగ్’ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నారు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కావడం విశేషం. ఈ శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ.. రెండో దశలో భాగంగా త్వరలోనే విశాఖలో ఐటీ స్పేస్ నిర్మించి.. ఐటీ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
రూ.2,172.26 కోట్లతో ఆసక్తి వ్యక్తీకరణ
2023లో చెప్పిన విధంగానే రహేజా గ్రూప్ విశాఖలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.2,172.26 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండు దశల్లో మొత్తం 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, అనుబంధ, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన సముదాయాలు నిర్మించనుంది. మొదటి దశలో 2028 నాటికి వాణిజ్య భవనాలు, 2030 నాటికి నివాస సముదాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని రహేజా ఆసక్తి చూపిస్తోంది. ఇక రెండో దశలో భాగంగా 2031 నాటికి మిగిలిన కమర్షియల్ భవనాలు, 2035 నాటికి నివాస సముదాయాలు పూర్తి చేయనుంది. మొత్తంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రహేజా సంస్థ పెట్టుబడులకు ముందుకు రావడం శుభపరిణామమని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహా విశాఖ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. ప్రఖ్యాత రహేజా గ్రూప్ విశాఖలో రెండో దశ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఫేజ్–1లో భాగంగా రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ పనులు తుది దశకు చేరుకోగా.. ఇప్పుడు దానికి అదనంగా రూ.2,172 కోట్లకు పైగా వ్యయంతో భారీ ఐటీ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నూతన పెట్టుబడి ద్వారా 9,681 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


