దొంగనోట్లు ముద్రిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ : దొంగనోట్లు ముద్రించి నగరంలో చెలామణి చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి కరెన్సీ ముద్రించడానికి వినియోగిస్తున్న పేపర్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ(లా అండ్ ఆర్డర్) మేరీ ప్రశాంతి తెలిపారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లో ఒక ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎంవీపీ సీఐ కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్, ఎస్‌ఐ ఎస్‌కే ఖాదర్‌బాషా, టాస్క్‌ఫోర్స్ సీఐ ఆర్.అప్పలనాయుడు, ఎస్‌ఐ హరీష్, సిబ్బందితో కలిసి ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లా, బల్వాడీ మండలానికి చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తా(60) ల్యాప్‌టాప్, ప్రింటర్ ద్వారా రూ.500, రూ.200 కరెన్సీ నోట్లను ముద్రిస్తుండగా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వరప్రసాద్, ఆనంద్ అనే వ్యక్తులతో కలిసి శ్రీరామ్ కొద్ది రోజుల క్రితం రూ.10 లక్షల దొంగ నోట్లను ముద్రించి నగరంలో చెలామణి చేయడానికి విఫలయత్నం చేసినట్లు తెలుసుకున్నారు. శ్రీరామ్ ఇండోర్, ఉజ్జయిని, ముంబై, బరవాని ప్రాంతాల్లో కూడా దొంగ నోట్లు తయారు చేయగా.. ఉజ్జయిని ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు డీసీసీ తెలిపారు. అతడు నోట్లను ముద్రించడానికి ముంబై నుంచి పేపర్‌ను రప్పించినట్లు చెప్పారు. దొంగనోట్లను ముద్రించడానికి ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దొంగనోట్లు ముద్రిస్తున్న వ్యక్తి అరెస్ట్


