శ్రీ ఆంజనేయం.. | - | Sakshi
Sakshi News home page

శ్రీ ఆంజనేయం..

Oct 24 2025 8:04 AM | Updated on Oct 24 2025 8:04 AM

శ్రీ

శ్రీ ఆంజనేయం..

● వెయ్యి హనుమాన్‌ విగ్రహాలను ప్రతిష్టించిన యోగా రాజు ● ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్తున్న స్వామీజీ

సహస్రం..

సంపూర్ణం

భగవంతుని చేరడానికి భక్తి, సేవ రెండు ప్రధాన మార్గాలు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా ఆచరిస్తున్నారు సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు ఆయన ఎంచుకున్న మార్గం హనుమాన్‌ విగ్రహాల ప్రతిష్ట. ఆంజనేయుడు భక్తికి, సేవకు, ధైర్యానికి ప్రతీక. అలాంటి హనుమంతుని స్వరూపాలను గిరిజనుల చెంతకు చేర్చేందుకు ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన మహా సంకల్పం.. దాతల సహకారంతో నేటికి వెయ్యి విగ్రహాల ప్రతిష్ట అనే బృహత్తర మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం విగ్రహాల ప్రతిష్ట మాత్రమే కాదు.. గ్రామాల్లో నిరంతర భక్తి భావాన్ని నింపిన ఒక ఆధ్యాత్మిక యజ్ఞం. – తగరపువలస

జీవీఎంసీ భీమిలి జోన్‌, రామయోగి అగ్రహారంలోని సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు అలియాస్‌ సాయిరామ్‌ స్వామీజీ.. గిరిజన ప్రాంతాల్లో అపూర్వమైన ఆధ్యాత్మిక సేవకు శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్ల కిందట 2017లో హుకుంపేట మండలం రాళ్లగడ్డలో తన తండ్రి కోన కుంచయ్య పేరుతో ప్రారంభించిన హనుమత్‌ ప్రతిష్టా యాగం ఈ విజయదశమి నాటికి వెయ్యి ఆంజనేయ విగ్రహాల ప్రతిష్టను పూర్తి చేసుకుంది. మొదటి మూడేళ్లలో 116 విగ్రహాలు ప్రతిష్టించిన స్వామీజీ గిరిజనుల్లో పెరుగుతున్న భక్తిభావాన్ని గమనించి, దైవబలం, దాతల సహకారంతో ఈ సేవను మారుమూల గ్రామాలకు విస్తరించారు. పెదబయలు, జీకే వీధి, డుంబ్రిగుడ, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, అరకు, పాడేరు, హుకుంపేట, అనంతగిరి వంటి ఏజెన్సీ మండలాలతో పాటు, ఒడిశాలోని నవరంగ్‌పూర్‌, కోరాపుట్‌, మల్కన్‌గిరి, సునాబెడ ప్రాంతాల్లో కూడా ఈ విగ్రహాలను ప్రతిష్టించారు. ఏజెన్సీ ముఖద్వారాలైన వడ్డాది, ముకుందపురంలలో 7, 8, 9, 12 అడుగుల హనుమ సిమెంట్‌ విగ్రహాలను తయారు చేయించారు. రహదారులు సరిగా లేని మారుమూల కొండ గ్రామాలకు సైతం గిరిజనుల సాయంతో విగ్రహాలను తరలించారు. భీమిలి పరిసరాల్లోని చేపలుప్పాడ, కాపులుప్పాడ, అన్నవరం, జేవీ అగ్రహారం గ్రామాల్లో కూడా పదుల సంఖ్యలో విగ్రహాలు నెలకొల్పారు. అన్నవరంలో ప్రతిష్టించిన 15 అడుగుల విగ్రహమే ఇప్పటి వరకు అతి పెద్దది. వెయ్యి విగ్రహాల మైలురాయిని అందుకున్న స్వామీజీ.. తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించారు. 1001వ విగ్రహంగా విశాఖ–తగరపువలస హైవేపై ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా 30 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించేందుకు సంకల్పించారు. ఆసక్తి కలిగిన దాతలు ఈ మహా కార్యంలో పాలుపంచుకోవాలని కోరారు.

అనాథలకు అండగా.. : స్వామీజీ సేవ కేవలం విగ్రహాల ప్రతిష్టకే పరిమితం కాలేదు. దాతల సహకారంతో సుమారు రూ.5 కోట్లు వెచ్చించి పదుల సంఖ్యలో శివాలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి ఆలయాలను నిర్మించారు. పునరుద్ధరించారు. వీటిలో జి.మాడుగులలో రూ.50 లక్షలతో నిర్మించిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మద్దిపేటలో శివాలయం, ములుసోబలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు ముఖ్యమైనవి. 2010లో విజయసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రామయోగి అగ్రహారంలో షిర్డీసాయి, నూకాంబిక, శ్రీకృష్ణుని ఆలయాలు నిర్మించారు. ఎవరూ లేని 60 మంది వృద్ధులకు తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 100 దేశీయ ఆవులతో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించి వదిలేయకుండా.. ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మికత నిరంతరం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టించిన అన్ని చోట్లా ఏడాది పాటు నెలకు రూ.5 లక్షల విలువైన పూజా సామగ్రిని ఆశ్రమం తరపున అందిస్తున్నారు. ప్రతిష్ట సమయంలో భక్తులకు భగవద్గీత, రామకోటి పుస్తకాలు, దేవుళ్ల చిత్రపటాలు, దుప్పట్లు, చీరలు, స్టీల్‌ కంచాలు పంపిణీ చేస్తున్నారు. కార్తీకమాసం, శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఉచిత యోగా శిక్షణ, వైద్య శిబిరాలు, తాగునీటి బోర్ల తవ్వకం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వంటివి నిరంతరం కొనసాగిస్తున్నారు.

సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యం

జీవీఎంసీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని 30 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని ఆన్వేషిస్తున్నాం. ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే 98486 49067, 85005 09067 నంబర్లలో సంప్రదించవచ్చు. సనాతర ధర్మం పరిరక్షణ, సేవాభావం లక్ష్యంగా కార్యక్రమాలు, విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

– యోగా రాజు

ఏజెన్సీ, భీమిలి తీర ప్రాంతాల్లో ప్రతిష్టించిన విగ్రహాలు

శ్రీ ఆంజనేయం.. 1
1/3

శ్రీ ఆంజనేయం..

శ్రీ ఆంజనేయం.. 2
2/3

శ్రీ ఆంజనేయం..

శ్రీ ఆంజనేయం.. 3
3/3

శ్రీ ఆంజనేయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement