
ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు
మహారాణిపేట : ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించినా, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. గతంలో అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను పరిశీలించిన కలెక్టర్, కాల్ సెంటర్ ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించారు. ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగుపడాలని సూచించారు. అందిన ఫిర్యాదును పరిష్కరించే క్రమంలో ఫిర్యాదుదారులతో ఫోన్‌లో మాట్లాడి, సంతృప్తికరంగా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. పోలీస్ శాఖలో అవలంబిస్తున్న ఎండార్స్‌మెంట్ విధానాన్ని మార్చాలని, సమస్యపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారుకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
విచారణకు ఆదేశం
ఆనందపురం మండలం, వెల్లంకి గ్రామంలో సర్వే ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారి నిర్లక్ష్యం ప్రదర్శించి, నగదు కూడా అడిగారని వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సర్వే శాఖ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. నిజం నిరూపితమైతే సదరు సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలన్నారు. అలాగే ఫీడ్‌బ్యాక్ సర్వేలో తేలిన ఏడుగురు సిబ్బంది దురుసు ప్రవర్తనపై వారికి నోటీసులు ఇవ్వాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని ఆదేశించారు.
347 వినతులు
సోమవారం పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి 347 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 136, జీవీఎంసీకి 66, పోలీస్ శాఖకు 22, ఇతర అంశాలకు సంబంధించి 123 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్. భవాని శంకర్, ఏడీసీ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, వర్చువల్‌గా మండల తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 138 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌తో పాటు నగర మేయర్ పీలా శ్రీనివాస్ ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 138 వినతులు అందగా, వాటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 64 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 8, రెవెన్యూ విభాగానికి 16,ప్రజారోగ్య విభాగానికి 13, ఇంజనీరింగ్ విభాగానికి 24, మొక్కల విభాగానికి 4,యూసీడీ విభాగానికి 9 వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి ఫిర్యాదులను పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, సిటీ ప్లానర్ మీనాకుమారి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పలువురికి నోటీసులు ఇవ్వాలని ఆదేశం
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ హరేందిర ప్రసాద్