స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్లలో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్లలో దొంగల హల్‌చల్‌

Jul 8 2025 7:18 AM | Updated on Jul 8 2025 7:18 AM

స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్లలో దొంగల హల్‌చల్‌

స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్లలో దొంగల హల్‌చల్‌

భారీగా బంగారం, నగదు చోరీ

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఒకే రాత్రి, ఒకే సెక్టార్‌లోని ఐదు క్వార్టర్లలో చోరీలకు పాల్పడటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనల్లో నగదు, బంగారం, వెండితో పాటు ఓ మోటార్‌

సైకిల్‌ కూడా చోరీకి గురైనట్లు స్టీల్‌ప్లాంట్‌ క్రైం పోలీసులు వెల్లడించారు.

ఎస్‌.ఎం.ఎస్‌–2 సీనియర్‌ టెక్నీషియన్‌ ఇంట్లో భారీ చోరీ

సెక్టార్‌–6లోని 335 డి క్వార్టర్‌లో నివసిస్తున్న ఎస్‌.ఎం.ఎస్‌–2 విభాగం సీనియర్‌ టెక్నీషియన్‌ సీహెచ్‌ఈ రాజ్‌కుమార్‌ ఈనెల 5న తమ కుటుంబంతో అత్తగారింటికి వెళ్లారు. 7న పొరుగింటికి చెందిన సత్యనారాయణ ఫోన్‌ చేసి రాజ్‌కుమార్‌ ఇంటి తలుపు తెరిచి ఉన్న విషయాన్ని తెలియజేశారు. వారు వచ్చి చూడగా, ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, రూ. 50 వేలు, 70 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టిఫిన్‌ షాప్‌ యజమాని బైక్‌ అపహరణ

అదే సెక్టార్‌లోని 327 డీ క్వార్టర్‌లో నివసిస్తున్న పి.రాధాకృష్ణ, సెక్టార్‌–6 కాంప్లెక్స్‌లో టిఫిన్‌ షాప్‌ నడుపుతున్నారు. ఈనెల 6న రాత్రి ఇంటికి వచ్చి తన మోటార్‌సైకిల్‌ను బయట పార్క్‌ చేశారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో ఉద్యోగి ఇంట్లో ..

ఇదే సెక్టార్‌లోని మరో క్వార్టర్‌లో నివసిస్తున్న ఓ ఉద్యోగి ఊరిలో లేని సమయంలో దొంగలు అతని ఇంట్లో చొరబడ్డారు. ఇంటి నుంచి 45 గ్రాముల బంగారం, రూ. లక్ష చోరీకి గురైనట్లు సమాచారం. ఆ ఉద్యోగి తిరిగి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది.

ఎస్‌ఐ ఇంటి తాళం విరగ్గొట్టి...

ఆశ్చర్యకరంగా ఇదే సెక్టార్‌లోని ఓ ఎస్‌ఐ క్వార్టర్‌లో కూడా దొంగలు లాక్‌ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే ఇంట్లో పోలీసు దుస్తులు చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే క్లూస్‌ టీం ఘటనా స్థలాలకు చేరుకుని చోరీ జరిగిన అన్ని క్వార్టర్లలో వేలిముద్రలు సేకరించింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న క్రైం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేస్తామని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో ఒకేసారి ఇన్ని చోరీలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘాను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement