
దిగొచ్చిన మద్యం వ్యాపారి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ 38వ వార్డులో మతపరమైన ప్రాంతం సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై స్థానికులు, ముఖ్యంగా మహిళలు చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. దుకాణం యజమాని రెండు రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.ఈ ప్రాంతంలో దర్గా, చర్చి, కన్యకాపరమేశ్వరి, రాములవారి ఆలయాలు, కృష్ణుడి ఆలయం వంటి పలు మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిబంధనలను విస్మరించి ఈ దుకాణానికి అనుమతి ఇచ్చిందని వారు ఆరోపించారు. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద హడావుడిగా తెరిచిన ఈ దుకాణంపై రెండు రోజుల క్రితం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో రెండు రోజులు దుకాణం తెరవలేదు. సోమవారం తిరిగి దుకాణం తెరవడంతో స్థానికులు మరోసారి రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఎకై ్సజ్ శాఖ అధికారిని విచారణకు ఆదేశించారు.
అయితే సంబంధిత శాఖ అధికారి పరిశీలించి వెళ్లిన వెంటనే మద్యం దుకాణం తెరిచి విక్రయాలు ప్రారంభించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్‌టౌన్ సీఐ జీడీ బాబు ఆందోళనకారులను సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేస్తూ దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. చివరకు, మహిళల నిరసన ముందు దుకాణం యజమాని దిగిరాక తప్పలేదు. సోమవారం సాయంత్రం యజమాని స్వయంగా వచ్చి రెండు రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
మహిళల ఆందోళనకు తలొగ్గిన వైనం
రెండ్రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ
ఆందోళన విరమించిన
38వ వార్డు వాసులు

దిగొచ్చిన మద్యం వ్యాపారి