
మద్యం మత్తులో దాడి
నలుగురికి గాయాలు.. ఆరుగురిపై కేసులు
గోపాలపట్నం : తమను అవమానిస్తున్నారని కక్ష పెట్టుకుని, నలుగురిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద చోటు చేసుకుంది. గోపాలపట్నం ఎస్‌ఐ రామారావు, స్థానికులు తెలిపిన వివరాలు.. కొత్తపాలేనికి చెందిన లైటింగ్ డెకరేషన్ ఈవెంట్ పనులు చేస్తున్న కొందరు రోజూ గవర రామాలయం వద్ద కూర్చుని బాతాఖానీ కొడుతుంటారు. రోజూ అవమానకరంగా వేధిస్తున్నారన్న కక్షతో సురేంద్ర అనే వ్యక్తి మరి కొందరితో వచ్చి కత్తితో సరపాక రాజేష్, సూరికొండ మణికంఠ, లంక రమణ, అమరపిల్లి కనకరాజులపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారంతా ఫుల్లుగా మద్యం, గంజాయి సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆరుగురిపై కేసు : దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఒకరు పరారీలో ఉండగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. ఏ విధమైన కక్షలు లేవని నిక్‌నేమ్‌తో పిలుస్తున్నారన్న అక్కసుతో దాడి చేశారని గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మద్యం మత్తులో దాడి