
యువకుడు అనుమానాస్పద మృతి
అల్లిపురం: కొబ్బరితోటకు చెందిన కనకరాజు (32) అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కనకరాజు శనివారం జీతం అందుకున్న తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ రాత్రి 12 గంటల సమయంలో డాల్ఫిన్ వద్ద తన ద్విచక్రవాహనం వదిలేసి తిరిగి వస్తానని చెప్పి వెళ్లినవాడు మళ్లీ రాలేదు. ఆదివారం మధ్యాహ్నం కనకరాజు చెల్లి నాగజ్యోతికి కానిస్టేబుల్ ఫోన్ చేసి, ఫొటో పంపగా, అది తన తమ్ముడేనని గుర్తించింది. కనకరాజు మృతి చెందాడని, కేజీహెచ్ మార్చురీలో మృతదేహం ఉందని కానిస్టేబుల్ నాగజ్యోతికి చెప్పాడు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నాగజ్యోతి, తన తమ్ముడు మద్యం తాగి అదుపుతప్పి కిందపడటం మృతిచెంది ఉండొచ్చని, లేదా మరే ఇతర కారణమైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడించాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం ఇది ప్రమాదం కాదని, హత్య అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేస్తున్నాం
టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించి బంధువులకు అప్పగించామన్నారు. కింద పడటంతో తల వెనుక బలమైన గాయం తగలడం వల్లే మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, సమగ్ర దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని సీఐ వివరించారు.
తాగి పడిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసుల నిర్థారణ
హత్యేనని బంధువుల అనుమానం
దర్యాప్తు చేస్తున్నామన్న టూటౌన్ సీఐ