
ఏయూ అనుబంధ కళాశాలల అభివృద్ధికి కృషి
మద్దిలపాలెం: విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా విశ్వవిద్యాలయంతో అనుబంధ కళాశాలలు కలిసి ముందుకు సాగాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ సూచించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏయూ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో సోమవారం సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా, పటిష్టంగా జరగాలన్నారు. బీఈడీ, న్యాయ కళాశాల పనితీరు మరింత మెరుగు పడాలన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనుబంధ కళాశాలలను భాగస్వాములను చేస్తూ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొంగ్రాంలను ప్రారంభిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ కళాశాలల్ని భాగస్వామ్యం చేస్తూ రూరల్ ఔట్‌రీచ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ 100 ఫ్యాకల్టీ, 10వేల మంది విద్యార్థులను ఏఐ, డీప్ లెర్నింగ్ రంగాలలో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ అనుబంధ కళాశాల గుర్తింపు, ఫీజులు, కోర్సుల నిర్వహణ తదితర అంశాలను చర్చించడానికి, కళాశాలల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఓ వేదికగా మార్చుకోవాలని సూచించారు. సీడీసీ డీన్ ఆచార్య టి.వెంకటకృష్ణ, యూజీ పరీక్షల డీన్ ఆచార్య నానాజీరావు, అనుబంధ కళాశాలల అసోసియేషన్ కార్యదర్శి రమణాజీ తమ పరిధిలోని అంశాలను వివరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, గౌరవ అధ్యక్షుడు బలరామకృష్ణ, గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు తదితరులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీన్‌లు ఆచార్య కె.రమాసుధ, కె.శ్రీనివాసరావు, కె.రాంబాబు, బి.మునిస్వామి, ఎస్.హరినాథ్, పి.శ్యామల, డీఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు.