
ట్రాన్స్‌పాండర్
మత్స్యకారుల
పాలిట దిక్సూచి
మహారాణిపేట: సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులు తరచుగా తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాగే సరిహద్దులు దాటి ఇతర దేశాల భద్రతా సిబ్బందికి చిక్కి జైళ్లలో మగ్గుతున్నారు. సముద్రంలో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ లేకపోవడం వల్ల తుపానుల ముప్పును గుర్తించలేకపోవడం, చిన్నపాటి తప్పిదాలతో సరిహద్దులు దాటడం వంటి సమస్యలను మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర మత్స్యశాఖ మత్స్యకారుల కోసం సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. 100 శాతం సబ్సిడీతో ‘ట్రాన్స్‌పాండర్’ అనే దిక్సూచిని గంగపుత్రులకు అందిస్తూ, వారిని సురక్షితంగా ఉంచడానికి అభయమిస్తోంది.
బోట్లకు అమరిక
ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఆధారిత ట్రాన్స్‌పాండర్లను రూపొందించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద ఇది పూర్తి ఉచితంగా (100 శాతం రాయితీతో) అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 350 మోటరైజ్డ్, 760 మెకనైజ్డ్ బోట్లకు అంటే.. మొత్తంగా 1100 బోట్లకు ఈ ట్రాన్స్‌పాండర్లను అమర్చాలని మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్‌పై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 634 బోట్లలో ట్రాన్స్‌పాండర్లున్నాయి. వీటిని ఎలా వినియోగించాలనే అంశంపై ప్రతి మత్స్యకారుడికీ అవగాహన కల్పిస్తున్నారు.
సమగ్ర సమాచారం అందించేలా...
సముద్రంలో వాతావరణం ఎలా ఉంది.? తుపాను హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా.? అనే సమాచారం అందించేలా దీన్ని రూపొందించారు. వేటకు వెళ్లే మత్స్యకారులు కొన్ని సందర్భాల్లో ఫోన్ సిగ్నల్స్‌ను కోల్పోతారు. అటువంటి సమయంలో వారికి తుపాను సమాచారం, ఇతర ప్రమాదాల సమాచారం చేర్చాలంటే అత్యంత కష్టం. అలాంటి సమయంలో ఈ ట్రాన్స్‌పాండర్లు మత్స్యకారులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సహాయపడుతుంది. సరిహద్దులు దాటకుండా మత్స్యకారులను హెచ్చరించి, ఇతర దేశాల భద్రతా సిబ్బందికి చిక్కుకోకుండా కాపాడుతుంది. సముద్రంలో ప్రమాదం జరిగితే శాటిలైట్ ద్వారా కోస్టుగార్డు, మత్స్యశాఖ కార్యాలయం, బోటు యజమానికి సమాచారం వెళ్తుంది. అంతేకాదు చేపల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ఒకటి బోటుకు, మరొకటి డ్రైవర్ వద్ద అమర్చుతారు. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. అయితే కొందరు మత్స్యకారులు వీటిని అమర్చినప్పటికీ.. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఫలితంగా ఆ బోట్లకు సందేశాలు పంపించడం ఇబ్బందవుతోంది. వేట కోసం బోటు ప్రారంభించిన వెంటనే ట్రాన్స్‌పాండర్ స్విచ్ ఆన్ చేస్తే సమాచారం అందించగలమని, ఈ విషయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సరిహద్దు హెచ్చరికలను అందించే అత్యాధునిక వ్యవస్థ
జిల్లాలో 1,100 బోట్లకు అమర్చేందుకు మత్స్యశాఖ సన్నద్ధం
ఇప్పటివరకు 634 బోట్లకు శతశాతం రాయితీతో అందజేత

ట్రాన్స్‌పాండర్