
ఆవిష్కరణల కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుదాం
ఏయూక్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఎంపీ ఎం.శ్రీ భరత్ పిలుపునిచ్చారు. శనివారం బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌లో జరిగిన ఇన్ఫినిటీ విశాఖపట్నం 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతీయ విద్యా విధానం, పర్యవేక్షణ, ఆవిష్కరణ అనే కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. పరిశ్రమలు, విద్యా వ్యవస్థలు సమన్వయంతో పని చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా నిలపడంపై నిపుణులు తమ విలువైన సూచనలు అందించారు. సదస్సులో భాగంగా ఆవిష్కరణలు, భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలు, డెమో జోన్స్, స్టార్టప్ పిచెస్, విద్యార్థుల ఆవిష్కరణలను ప్రదర్శించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాలపై చర్చలు జరిగాయి. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కేపీఎంజీ, క్లౌడ్ 4సీ, పాత్ర ఇండియా వంటి సంస్థల నిపుణులు తమ ప్రత్యక్ష ఉదాహరణలు, నైపుణ్యాలను పంచుకున్నారు. ఐటీఏఏపీ అధ్యక్షురాలు లక్ష్మీ ముక్కవిల్లి, జీఐఐ ఏపీ అధ్యక్షుడు జి.మురళీకృష్ణ, ఎస్‌టీపీఐ అదనపు డైరెక్టర్ డాక్టర్‌సురేష్, ఎఫ్‌ట్రానిక్స్ సీఈవో రామకృష్ణ దాసరి పాల్గొన్నారు.