
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలోనూ అదే నిర్లక్ష్యం
● తొలిపావంచా వద్ద కూలిన షెడ్ ● మారని ఇంజినీరింగ్ అధికారుల తీరు ● తప్పిన పెను ప్రమాదం
సింహాచలం: ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా సింహాచలం కొండదిగువ తొలి పావంచా వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది. సింహాచలంలోని కొండ దిగువ తొలిపావంచాకి ఒక విశిష్టత ఉంది. గిరి ప్రదక్షిణ రోజుల్లో ఇక్కడే కొబ్బరికాయ కొట్టి భక్తులు నడక ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి తిరిగి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ముగిస్తారు. ఆ రోజు తొలి పావంచా వద్ద నెలకునే రద్దీ అంతా ఇంతా కాదు. వీరి సౌకర్యార్థం తొలిపావంచా పక్కనే ఉన్న అర ఎకరం విశాల ప్రాంగణంలో దాదాపు 20 క్యూలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎండ, వాన నుంచి రక్షణ పొందేందుకు రెండు రోజులుగా ఈ షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పనులను ఇంజినీరింగ్ పర్యవేక్షించకుండా పూర్తిగా కాంట్రాక్టర్‌పైనే వదిలేశారు. పైగా ఈసారి రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి 20 మంది వరకు ఇంజినీరింగ్ అధికారులను డిప్యూటేషన్‌పై ఇక్కడకు రప్పించారు. అయితే నిర్మాణ పనుల నాణ్యతను పర్యవేక్షించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న చందనోత్సవం రోజున గోడకూలి ఏడుగురు మరణించిన ఘటన నుంచి కూడా అధికారులు పాఠాలు నేర్చుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దేవస్థానం ఈవో వి.త్రినాథరావు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.5.80 లక్షల విలువైన ఈ పనులను కేఎస్‌ఆర్ సప్లయర్స్ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించగా, వారు మరో సబ్–కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. క్రేన్ సహాయంతో పనులు చేస్తుండగా షెడ్ కూలిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భక్తుల భద్రత దృష్ట్యా, కూలిన షెడ్‌ను పూర్తిగా తొలగించాలని, ఇకపై ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయకుండా కేవలం క్యూలు మాత్రమే కొనసాగించాలని ఈవో ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ఇదే ఘటన జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పలువురు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.