
‘ప్రసాద్’ పనుల వేగవంతానికి కృషి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ క్షేత్రంలో కేంద్ర ప్రభుత్వం రూ.54 కోట్లతో చేపట్టిన ప్రసాద్ పథకం పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానంలో రూ.54 కోట్లతో చేపట్టిన ప్రసాద్ పథకం అభివృద్ధి పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 50 శాతం పనులు వేగంగా జరిగేలా చూస్తానన్నారు. వరాహ పుష్కరిణి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పూల తోట, గోశాల ఎంతో పురాతనమైనవని, వాటి వైభవం మరింత పెరగాలన్నారు. భైరవస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. దర్శనార్థం వచ్చిన మాధవ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసు కుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయ న పేరు మీద అర్చకులు స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాలను దేవస్థానం ఈవో వి.త్రినాథరావు అందజేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరెడ్డి, 98వ వార్డు అధ్యక్షుడు ఆర్. వర్మ, విశ్వహిందూ పరిషత్ నాయకుడు పూడిపెద్ది శర్మ తదితరులు పాల్గొన్నారు.