
అనస్తీషియాలో ఆధునిక పోకడలు
విశాఖ వేదికగా నేటి నుంచి వైద్యుల సదస్సు
మధురవాడ: విశాఖ వేదికగా 40వ ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషియాలజిస్ట్స్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు ఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు, నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. అనస్తీషియా వైద్యంలో వస్తున్న కొత్త పరిజ్ఞానంపై అవగాహన, రోగులకు మరింత మంచి సేవలు అందించే విషయాలు పరస్పరం తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం మధురవాడ వి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో వారు ఇతర రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో కలసి మాట్లాడారు. ఆధునిక నొప్పి నివారణా పద్ధతులు, వైద్యంలో వస్తున్న మెళకువలు, పరిజ్ఞానం ఎక్స్ఛేంజ్ తదితర అంశాలు సదస్సులో ఉంటాయన్నారు. సదస్సుకు సౌత్ ఇండియా పరిధిలోని ఏపీ, తెలంగాణాతో పాటు కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన 1,300 మంది ప్రతినిధులు హాజరు కానున్నా రని పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న పీజీ విద్యా ర్థులు, ప్రాక్టీషనర్స్‌కు అవసరమయ్యే 36 రకాల పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.