
డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రత్యేక డ్రైవ్
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా కాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు డీసీపీ–1 అనిత వేజెండ్ల తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు గురువారం విశాఖ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లలో నగర పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం, డాగ్ స్వ్కాడ్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ పి.రామచంద్రరావు, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ధనుంజయనాయుడు, రైల్వే భద్రతా దళం ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఈగల్ టీం ఇన్‌స్పెక్టర్ కల్యాణి నేతృత్వంలో మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీలు, కోచ్‌లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ పరిధిలో నిరంతరం తనిఖీలు చేస్తామని జీఆర్పీ సీఐ తెలిపారు.