
నగరంలో ఏఐ నిఘా నేత్రాలు
విశాఖ సిటీ : ట్రాఫిక్ పోలీసులు లేరని సిగ్నిల్ జంప్ చేద్దామని.. పోలీసుల చూపు మరల్చి ట్రిపుల్ రైడింగ్‌లో దూసుకుపోదామని.. హెల్మెట్ ధరించకుండా బైక్‌లపై రోడ్ల మీద చక్కర్లు కొట్టేద్దామని.. నేరాలు చేసి దర్జాగా నగర రోడ్లపై తిరుగుదామనుకుంటే ఇకపై కుదరదు. మూడో కన్ను ఇట్టే పట్టేస్తుంది. చలానా వేసేస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సీసీ కెమెరాల ఏర్పాటుకు నగర పోలీస్ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. ఇందుకోసం ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
7,500లకు పైగా సీసీ కెమెరాలు
జిల్లాలో ప్రస్తుతం 7,500లకు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 90 శాతం కేసులు ఈ నిఘా కెమెరాల ద్వారానే పరిష్కారమవుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో నగరంలో ఈ సీసీ కెమెరాల సంఖ్యను విస్తృతం చేయాలని సీపీ నిర్ణయించారు. నగరంలోనే కాకుండా, శివారు ప్రాంతాల్లో సైతం ప్రజలు వెళ్లగలిగే అన్ని చోట్లా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు గట్టి నిర్ణయంతో ఉన్నారు. వీటివల్ల నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
ఏఐ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ
జిల్లాలో పోలీసులు ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కొన్ని జంక్షన్లలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వారికి చలానాలు వేస్తున్నారు. ఇకపై ఇటువంటి మాన్యువల్ విధానానికి స్వస్తి చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫైన్‌లు వేసే విధానాన్ని అమలు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగర పరిధిలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆహ్వానించారు. సదరు కంపెనీల ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
నేరాలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక దృష్టి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే
ఆటోమేటిక్‌గా చలానా
కలెక్టరేట్‌లో ప్రజెంటేషన్ ఇచ్చిన
సాఫ్ట్‌వేర్ సంస్థలు
ఆటోమేటిక్‌గా చలానాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ ద్వారా అతివేగం, పరిమితికి మించి వాహనాన్ని నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనులు దొరికిపోనున్నారు. వారికి ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ చలానాలు జారీ అయిపోతాయి. అలాగే ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే నగర జంక్షన్లలో గల సిగ్నలింగ్ వ్యవస్థను ఏకీకృతం చేయనున్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్ వ్యవస్థ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.