
‘సుపరిపాలనలో తొలిఅడుగు’ బహిష్కరణ
తగరపువలస: భీమిలి మండలం అన్నవరం పంచాయతీలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజు, అతని వర్గం బహిష్కరించింది. ఇప్పటికే ఆరుసార్లుగా మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డీఏఎన్ రాజు స్థానంలో కొత్త అధ్యక్షుడి కోసం పార్టీలో విస్తృతంగా చర్చలు జరిగాయి. రాజు, యరబాల అనిల్‌ప్రసాద్ పేర్లు ప్రతిపాదించినప్పటికీ.. ఏడాది కిందట ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సరగడ అప్పారావు పేరును ప్రతిపాదించి పార్టీ అధిష్టానానికి పంపించారు. దీనిని వ్యతిరేకించిన రాజు, అనిల్ ప్రసాద్ వర్గం ఎంపీ భరత్ ద్వారా నిలుపుదల చేయించి విజయం సాధించారు. దీంతో ప్రతి పంచాయతీలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో డీఏఎన్ రాజు పార్టీకి దూరంగా ఉండిపోవడంతో అతని వర్గానికి పార్టీ కార్యక్రమాల గురించి ఎవరూ సమాచారం అందించడం లేదు. దీంతో రాజు వర్గం ఇతర పార్టీల వైపు చూస్తోంది. సరగడ అప్పారావు కంటే అనిల్ ప్రసాద్ కార్యకర్తలతో కలిసి పని చేస్తాడని గుర్తించడంలో ఎమ్మెల్యే గంటా విఫలం అయ్యారని రాజు వర్గం గుర్రుగా ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన వెంకటప్పడుకు ప్రాధాన్యమివ్వడం రాజు, అనిల్ ప్రసాద్‌లతో పాటు వారి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతోనే అన్నవరం కార్యక్రమాన్ని బహిష్కరించాయి.