
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజా
విశాఖ లీగల్: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు చెన్నం శెట్టి రాజా అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ ప్రాధికార సంస్థ భవనంలో రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థ పిలుపు మేరకు బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2015–2021 సంవత్సరాల మధ్య చిన్నారుల సామాజిక ఆర్థిక ఇతర కోణాలను పరిశీలించి, వారికి ఉత్తమ సేవ అందించడానికి కొత్త చట్టాలను తీసుకొచ్చారన్నారు. బాలల ఉత్తమ ప్రయోజనాలను గుర్తించి వారికి న్యాయపరమైన సేవలు అందించడానికి రెండు పథకాలు అమలు జరిపినట్లు చెప్పారు. న్యాయపరమైన రక్షణ, బాలల హక్కుల పరిరక్షణ ఈ సేవల్లో అంతర్భాగం అన్నారు. అన్ని విధాలైన ఆరోగ్య సేవలతో పాటు వినికిడి, శారీరక వైకల్యం వంటి అంశాలను పరిశీలించి తగిన విధంగా ఆదుకోవాలని చట్టం వివరిస్తున్నట్లు చెప్పారు. బాలల ఆనందమయ జీవితానికి కొత్త చట్టాలు ఎంతో ఉపకరిస్తాయని విశాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య విద్యాధికారి కె.నాగేశ్వరరావు, కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.సునీత, జిల్లా బాలల సంక్షేమ శాఖ పీడీ ఎంఆర్‌ఎల్ రాధా, జీవీఎంసీ అధికారులు, అన్ని మండలాల అధికారులు, అనాధాశ్రమాల ప్రతినిధులు, నిరాశ్రయుల సేవా సంస్థల ప్రతినిధులు, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన అధికారులు, దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.