
డిగ్రీ కాలేజీల్లో తనిఖీలెప్పుడో.!
● ఉన్నత చదువులపై పర్యవేక్షణ కరువు ● నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల నిర్వహణ ● ఎఫిలియేషన్ పేరిట ప్రైవేట్ కాలేజీల నుంచి వసూళ్లు?
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 196 డిగ్రీ, పీజీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు 25 వేలకు పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి కళాశాలల నిర్వహణకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయంలోని కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ (సీడీసీ) ఈ మొత్తం వ్యవహారాలను చూస్తోంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్‌లతో ఈ నెల 28న ఉన్నత విద్యామండలి పెద్దలు సమావేశం ఏర్పాటు చేసినందున.. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.
కళాశాలల నిర్వహణకు ఇవి ఉండాల్సిందే..
డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆరు వేలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన పక్కా భవనాలు ఉండాలి. విద్యార్థుల సంఖ్య, నిర్వహించే కోర్సులకు అనుగుణంగా తరగతి గదులు, గ్రంథాలయం, కార్యాలయ గది, స్టాఫ్ రూం, బాలికలకు వెయింటింగ్ రూం, సరిపడా మరుగుదొడ్లు, సైన్సు ప్రయోగాలకు అనువైన ప్రయోగశాలలు ఉండాలి. విద్యార్థులు ఆడుకునేందుకు మైదానం, పార్కింగ్ ప్రదేశం, అర్హత గల అధ్యాపకులు ఉండాలి. కళాశాలల నిర్వాహకులు వీటన్నింటికీ సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
పరిశీలనకు నిజ నిర్ధారణ కమిటీలు
కళాశాల యాజమాన్యాలు పొందుపరిచిన వివరాల మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు రిజిస్ట్రార్ ధ్రువీకరించి, దానిని వైస్ చాన్సలర్‌కు నివేదిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్న కళాశాలల జాబితాను ప్రవేశాల వెబ్‌సైట్‌లో పెట్టేందుకు ఉన్నత విద్యామండలికి పంపిస్తారు. ప్రైవేటు కళాశాలలను కట్టడిచేసే క్రమంలో గత ప్రభుత్వం ప్రవేశాలలో ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చింది. ఇదే రీతిలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.
ప్రైవేటు కళాశాలల లాబీయింగ్?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులకు రెక్కలొచ్చాయి. మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా విశ్వవిద్యాలయం నుంచి అనుమతులు పొందేందుకు అప్పుడే లాబీయింగ్ బృందం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. అడిగినంత ఇస్తే, విశ్వవిద్యాలయం నుంచి అఫిలియేషన్ వచ్చేలా తాము చూసుకుంటామని కూటమి నేతలతో అంటకాగే విశ్వవిద్యాలయంలోని ఓ వర్గం వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది.
విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో బీబీఏ, బీసీఏ కోర్సుల పేరుతో కళాశాల నిర్వహిస్తున్నప్పటికీ, ఇక్కడి విద్యార్థులకు వేరే కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే, అకాడమీల పేరుతో దర్జాగా కళాశాలలను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఓ కళాశాలలో ఒడిశాకు చెందిన విద్యార్థులను ఎక్కువగా చేర్పించుకుంటున్నారు. కేవలం పరీక్షలప్పుడే ఈ కళాశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ విజిటింగ్ అధ్యాపకులతోనే కళాశాల నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇవే కాదు.. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సగానికి పైగా డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే కళాశాలలు ఇదే తీరుగా కొనసాగుతున్నాయి.
విశాఖ జిల్లా ఎన్‌ఏడీ సెంటర్‌లోని ఓ డిగ్రీ కళాశాల పైఅంతస్తులో రేకుల షెడ్డు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు సరిగా లేవు. కళాశాలలో సరైన వసతులు లేవు. ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. సైన్సు గ్రూప్ విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు సరైన ప్రయోగశాలలు కూడా లేవు. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు.