
చరిత్ర సృష్టించేలా యోగా దినోత్సవం
మహారాణిపేట: విశాఖలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నందున, దీనిని చారిత్రక కార్యక్రమంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21 వరకు ‘యోగా మాసం’ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి 8 గంటల మధ్య ఆర్కే బీచ్ రోడ్‌లో 1,000 మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజిత వేజెండ్ల, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్‌తో పాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.