
డీసీఐ పనితీరు మార్చుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పనితీరుపై కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామచంద్రన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీసీఐ వార్షిక పనితీరుపై రామచంద్రన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. డీసీఐ పనితీరు అసంతృప్తికరంగా ఉందనీ.. కన్సార్టియం పోర్టుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నించాలని సూచించారు. డ్రెడ్జింగ్ మార్కెట్‌లో పోటీతత్వం పెరిగిందనీ.. దానికనుగుణంగా పనితీరు మెరుగు పరచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. దేశశ్యాప్తంగా నేవిగేషన్ మార్గాల్ని నిర్వహించేందుకు డీసీఐ సహకారం ఎంతో ఉందన్న విషయం ప్రతి ఉద్యోగి, అధికారి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఐ, విశాఖ పోర్టు చైర్మన్ డా.అంగముత్తు, డీసీఐ ఎండీ దుర్గేష్‌కుమార్ దూబే ఇతర అధికారులు పాల్గొన్నారు.