
సాలూరు శ్యామలాంబ జాతరకు 100 బస్సులు
ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు
మద్దిలపాలెం: సాలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు ఏపీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ జాతర కోసం సుమారు 100 ప్రత్యేక బస్సు సర్వీసులను కేటాయించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు వెల్లడించారు. మద్దిలపాలెంలోని సిటీ బస్ డిపోను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ జాతర కోసం 20 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సులన్నీ మంచి కండిషన్‌లో ఉండేలా చూసి.. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మద్దిలపాలెం డిపోలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. మద్దిలపాలెం డిపో మేనేజర్ అరుణ కుమారి, అసిస్టెంట్ ఇంజనీర్ బిందు, అసిస్టెంట్ మేనేజర్ మాధురి, స్టేషన్ మేనేజర్ మూర్తి, సూపర్‌వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.