
మినరల్ దోపిడీ
● ఆర్వో ప్లాంట్ల బరితెగింపు
● ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. ఆర్వో ప్లాంట్లకు వరం ● భూగర్భ జలాలు, ప్రజల డబ్బులు తోడేస్తున్న జలకాసురులు ● జిల్లాలో రోజుకు 30 లక్షల లీటర్ల నీరు వృథా ● కేవలం 10 శాతం ప్లాంట్స్‌కు మాత్రమే బీఐఎస్ గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం : సకల జీవరాశులకు నిత్యం అవసరమైనది నీరు. తిండి లేకుండా రెండు మూడు రోజులు ఉండగలవేమో కానీ.. నీరు లేకుండా బతకడం కష్టం. వృథా అయిన నీటిని తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం. అందుకే నీటిని వృథా చేయకుండా ఎంతో జాగ్రత్తగా వినియోగించాలి. జిల్లా పరిధిలో నీటి వ్యాపారం చేస్తున్న ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులకు మాత్రం కాసుల గలగలలే తప్ప.. నీటి గలగలల గురించి పట్టింపే లేదు. విచ్చలవిడిగా భూగర్భ జలాలను శక్తివంతమైన మోటార్లు పెట్టి తోడేస్తూ.. రూ.కోట్లలో నీటి వ్యాపారం చేస్తున్నారు. లీటర్ మినరల్ వాటర్ కోసం మూడు లీటర్ల నీటిని వృథా చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటేందుకు కారణమవుతున్నారు. ఓవైపు కాంక్రీట్ జంగిల్‌లా నగరాన్ని మార్చేస్తుండటంతో చుక్కనీటిని ఒడిసిపట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుండగా.. అలా ఒడిసిపడుతున్న ఒక్కో నీటి బొట్టును వాటర్ ప్లాంట్ల పేరుతో పీల్చేస్తూ జలకాసురుల్లా మారిపోతున్నారు. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కాసుల కక్కుర్తితో నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. వీటి ఏర్పాటుకు ఉన్న కొద్దిపాటి నిబంధనలు కూడా మామూళ్ల నీటిలో కొట్టుకుపోతున్నాయి.
వ్యాపారం రూ.కోట్లలో..
లంచాలు రూ.లక్షల్లో..
మంచినీటిపై నియంత్రణ లేకపోవడంతో ఇప్పుడు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మంచినీటిని వ్యాపారంగా మలుచుకొని కొందరు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను రూ.15 నుంచి రూ.30 వరకూ అమ్ముతున్నారు. ఒక్కో ప్లాంట్ రోజుకు రూ.5 వేల నుంచి రూ.7 వేలు వరకు వ్యాపారం చేస్తోంది. రోజుకు నగరంలో రూ.50 లక్షల నుంచి 70 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకూ నీటి వ్యాపారం సాగుతోంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ జిల్లాలోని 90 శాతానికిపైగా ప్లాంట్లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. అయినా అధికారులెవరూ వాటి జోలికి వెళ్లకపోవడం విస్తు చెందాల్సిన అంశం. వీటిపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారైనా వస్తే చాలు.. వారికి రూ.లక్షల్లో ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు.
ఆ వ్యవస్థ మా పరిధిలోకి రాదు..!
జిల్లాలో ఎక్కువ శాతం జీవీఎంసీ పరిధే ఉంది. దీంతో ఆర్వో ప్లాంట్లు తమ పరిధిలోకి రావంటూ టౌన్‌ప్లానింగ్, నీటిసరఫరా, రెవెన్యూ విభాగాల అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే తమ పరిధిలో ఉన్న ఆర్వో ప్లాంట్ల నుంచి వసూళ్లకు మాత్రం ఆయా జోన్లలో ఉన్న మూడు విభాగాల సిబ్బందీ సిద్ధమైపోతున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. నెలవారీ మామూళ్ల మాదిరిగా వసూలు చేసుకుంటూ.. ఆర్వో ప్లాంట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఆర్వో ప్లాంట్ వ్యాపారుల దందా పెరిగిపోతూ వస్తోంది.
జిల్లాలో ఉన్న ఆర్వో ప్లాంట్లు
సుమారు 1000
ఒక రోజుకు మొత్తం ప్లాంట్లు
తయారు చేస్తున్న మంచినీరు
10,00,000 లీటర్లు
ఒక రోజుకు వృథా చేస్తున్న నీరు
30,00,000 లీటర్లు
20 లీటర్ల క్యాన్ తయారీకి
వృథా అవుతున్న నీరు 60 లీటర్లు
జిల్లాలో నెలకు నీటి వ్యాపారం
దాదాపు రూ.15 కోట్లు
లీటర్ నీటికి 3 లీటర్ల వృథా
ఇంట్లో ఉన్న కుళాయి నుంచి చుక్క నీటి బొట్టు వృథాగా పోతుంటే విలవిల్లాడిపోతుంటాం. ఆ వృథాని అరికట్టేందుకు నానా తంటాలు పడుతుంటాం. కానీ వాటర్ ప్లాంట్‌లో మంచినీటి క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు కదా.. అవి తయారయ్యేందుకు ఎంత నీరు వృథా అవుతుందో ఓసారైనా ఆలోచించారా..? ఆర్వోప్లాంట్‌లో ఒక లీటరు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా తయారు చెయ్యాలంటే 3 లీటర్ల నీరు వృథా అవుతుంది. ఒకప్పుడైతే లీటరు నీటికి 6 లీటర్లు వృథా అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో 3 లీటర్లు మాత్రమే వృథా అవుతోంది. అంటే ప్రతి ఇంటికి తీసుకొస్తున్న 20 లీటర్ల క్యాన్లో మంచినీరు తయారీకీ 60 లీటర్ల నీరు వ్యర్థ జలాల్లో కలిసిపోతోంది. ఈ లెక్కన జిల్లా పరిధిలో దాదాపు 1000 ప్లాంట్‌లు ఉన్నాయి. రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల నీటిని తయారు చేస్తున్నారు. ఇందుకోసం 30 లక్షల లీటర్ల నీరు మురుగు కాల్వలో కలిసిపోతోంది. ఇలా కోట్ల లీటర్ల నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా నగరంలో 3 మీటర్లలో భూగర్భ జలాలుండాల్సి ఉండగా.. ప్రస్తుతం 9.50 మీటర్ల లోతుకు చేరి అథమ స్థాయికి చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

మినరల్ దోపిడీ

మినరల్ దోపిడీ