నోరూరగాయ.. | - | Sakshi
Sakshi News home page

నోరూరగాయ..

May 11 2025 12:26 PM | Updated on May 11 2025 12:26 PM

నోరూర

నోరూరగాయ..

● ఆంధ్రులకు ఆవకాయతో అనుబంధం ● వేసవి కాలంలోఇంటింటా సందడే సందడి ● కానీ అదంతా ఒకప్పటి మాట ● మారిన అభిరుచులతో తగ్గిన ఆదరణ ● పెరిగిన ధరలతో తయారీ భారమే..

నక్కపల్లి: ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి.

ధరల దరువు

కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

నాణ్యమైన మామిడి కాయలేవీ?

వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్‌ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్‌ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్‌ వ్యాపారుల వద్ద సూపర్‌మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు.

జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ

నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్‌ వన్‌ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌ డబ్బాల్లో ఉంచకూడదు.

– విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురం

ఆవకాయ చాలా కాస్ట్‌లీ గురూ..

40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది.

మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్‌ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది.

నోరూరగాయ..1
1/2

నోరూరగాయ..

నోరూరగాయ..2
2/2

నోరూరగాయ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement