ఒక్కటవుతున్న అంధులు | - | Sakshi
Sakshi News home page

ఒక్కటవుతున్న అంధులు

May 9 2025 12:48 AM | Updated on May 9 2025 3:29 PM

● ఒక్కటవుతున్న అంధులు ● అనంతపురం అబ్బాయితో విశాఖ అమ్మాయ

● ఒక్కటవుతున్న అంధులు ● అనంతపురం అబ్బాయితో విశాఖ అమ్మాయ

అనంతపురం అబ్బాయితో విశాఖ అమ్మాయికి వివాహం

11న ప్రేమసమాజం వేదికగా కల్యాణం

ప్రేమ సమాజం ముంగిట పెళ్లి సందడి నెలకొంది. ప్రేమ సమాజం కంచర్ల అన్నపూర్ణాదేవి వేదికగా, ప్రేమ సమాజం ఆశ్రిత శివజ్యోతి, అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన ఎనుముల గంగన్న, నారాయణమ్మల కనిష్ట పుత్రుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రల వివాహానికి సర్వం సిద్ధమైంది. వేద మంత్రాలు, పచ్చని తోరణాలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ, దాతల దీవెనలతో ఈ వేడుక కన్నుల పండుగగా జరగనుంది. విందు భోజనాలతో ప్రేమ సమాజం కళకళలాడనుం డగా, పెద్దల ఆశీస్సులతో ఈ అంధుల జంట ఒక్కటి కానుంది. గత నెల 11న పెద్దలు ఈ పెళ్లి తంతుకు శ్రీకారం చుట్టారు. ఇరువురూ అంధులే కావడం విశేషం. 

చూపులేని యువకుడు, తనలాంటి తోడు కోసం ఎదురుచూసి, ఆ కలను నిజం చేసుకుంటున్న శుభ తరుణమిది. ఈ అరుదైన వివాహం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. వివరాల్లోకి వెళితే, జన్మతః అంధుడైన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసి, ప్రస్తుతం కోయింబత్తూర్‌ పీఎఫ్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. రాఘవేంద్ర తల్లిదండ్రులది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురం. వ్యవసాయ నేపథ్యం కలిగిన వారి కుటుంబంలో రాఘవేంద్ర తనలాంటి కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు, రాఘవేంద్ర సోదరుడు రమణ కొందరు అందించిన సమాచారం ద్వారా విశాఖలోని ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించారు. దీంతో ఈ వివాహానికి మార్గం సుగమమైంది.

ప్రేమసమాజమే తల్లిగా..

మరోవైపు, శివజ్యోతి పుట్టుకతోనే కంటి చూపును, తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. నగరంలోని వివేకానంద చారిటబుల్‌ ట్రస్ట్‌ సిఫార్సుతో ఆమెకు ప్రేమ సమాజం ఆశ్రయం కల్పించింది. చినజీయర్‌ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌, నగరంలోని విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. ఇరువురి అంగీకారంతో, ప్రేమ సమాజం వేదికగా గత నెలలో తాంబూలాలు మార్చుకున్నారు. ఈ నెల 11న వివాహ ముహూర్తం ఖరారైంది. ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ద శివాజీ, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో శివజ్యోతి తరపున పెద్దలుగా వ్యవహరిస్తున్నారు.

రేపు పెళ్లి రాట

ప్రేమ సమాజం ప్రాంగణంలో శనివారం పెళ్లి రాట కార్యక్రమం జరగనుండగా, శివజ్యోతిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేయనున్నారు. మే 11న రాత్రి 7.05 గంటలకు స్వాతి నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రాఘవేంద్ర, శివజ్యోతిలు ఒక్కటి కానున్నారు. ఈ శుభ సందర్భానికి విచ్చేసిన అతిథులు, వధూవరుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రేమ సమాజం వేదికగా జరుగుతున్న ఈ అపురూపమైన వేడుక అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement