
ఏయూలో విద్యార్థులకు చోటేదీ..?
● పోటీ పరీక్షార్థులకు మొండిచేయి ● వసతి కోసం వేడుకున్నా పట్టని అధికారులు
విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో వసతి కావాలని కోరినా.. యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను కలిసేందుకు వెళ్లిన విద్యార్థులను అనుమతించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్దే విద్యార్థులు పడిగాపులు కాశారు. డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో యూనివర్సిటీలో వసతి కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం వర్సిటీ వసతి గృహాలకు జీవీఎంసీ తాగునీరు రావటం లేదనే కారణంతో విద్యార్థులకు అవకాశం కల్పించకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్లు, చీఫ్ వార్డెనన్లు చుట్టూ తిప్పించుకొని చివరకు నిరాశ మిగిల్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడంలేదని, తాగునీరు లేదని కారణంతో వసతి కల్పించకపోవటంపై విద్యార్థులు ఆగ్రహం వక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలో నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులందరినీ ఏకం చేసి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఓ విద్యార్ధి సంఘం నాయకుడు తెలిపాడు.