
విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన వివాహిత శ్వేత(24) మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఆర్.కె.బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మంగళవారం అర్ధరాత్రి ఆమె శవమై కనిపించిన విషయం విదితమే.. కేజీహెచ్ మార్చురీలో గురువారం శ్వేత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి, ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. ప్రాథమికంగా ఆమెది ఆత్మహత్యగా భావించినప్పటికీ.. మృతదేహం ఉన్న స్థితిని బట్టి అనుమానాస్పద మృతిగా కేసు విచారణ చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
సీసీ ఫుటేజ్‌లో రికార్డు కాలేదు
ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత ఎలా.. ఎటువైపు వెళ్లింది అనేది సీసీ ఫుటేజ్‌లో కనిపించలేదు. న్యూపోర్టు పోలీసులు గురువారం శ్వేత అత్తమామ ఇంటిని, పరిసరాలను పరిశీలించారు. అక్కడి సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో శ్వేత ఆనవాళ్లు కనిపించలేదని సమాచారం. అయితే ఆమె ఉండే వీధి నుంచి సీసీ కెమెరాలు లేని ఇంకో మార్గం కూడా ఉందని, అటువైపు నుంచి వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శ్వేత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.