
విశాఖపట్నం: వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, కట్టుకున్న భార్యను హత్యచేసి, దాన్ని సహజమరణంగా చిత్రీకరిద్దామను కున్నాడో ప్రబుద్ధుడు. గతంలో అతనిపై ఉన్న ఫిర్యాదు, మృతురాలి బంధువుల ఆరోపణల కోణంలో పోలీసులు విచారణ జరపగా చివరకు తానే హత్య చేశానని అంగీకరించాడు. వివరాలిలోకి వెళ్తే... జీవీఎంసీ 98వ వార్డు పరిధి అప్పన్నపాలేనికి సమీపంలోని జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో ఉంటున్న కిలాని శివ(27)కు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగాపురం దరి తుమ్మేరుపాలేనికి చెందిన శ్రీదేవి (23)తో 2017లో విహహం జరిగింది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలోని సొంతింట్లో శివ నివాసమంటున్నాడు. పై పోర్షన్‌లో శివ తల్లి, అతని అన్నయ్య ఉంటున్నారు. జీవీఎంసీ 8వ జోన్‌లో చెత్త తరలించే వాహనానికి శివ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శివకు కొంతకాలంగా వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో భార్య శ్రీదేవి నిలదీస్తూ వస్తోంది. దీంతో తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ విషయంపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. గురువారం రాత్రి కూడా భార్యతో గొడవపడ్డాడు.
శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నిద్రిస్తున్న శ్రీదేవి ముఖంపై తలగడ పెట్టి, మెడకు టవల్ చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఉదయం ఆమె లేవడం లేదని, కళ్లు తిరిగి పడిపోయిందని చుట్టుపక్కల వాళ్లని నమ్మించే ప్రయత్నం చేశాడు. తొలుత గోపాలపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తర్వాత 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న శ్రీదేవి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీదేవి మృతి చెందిందని తెలుసుకుని ఆమెది సహజ మరణం కాదని, ఆమె భర్తే హత్య చేశాడని వారంతా ఆరోపించారు.
ఈ విషయంపై శ్రీదేవి తల్లి గుంపాడ రాము ఫిర్యాదు మేరకు శివని పెందుర్తి సీఐ అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే హత్య చేసినట్టు శివ ఒప్పుకున్నాడు. శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.