
విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తొలి సెమీ ఫైనల్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. భోజ్‌పురి దబాంగ్ చివరి రెండు బంతులకు 10 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అగర్ ఒక బంతిని ఫోర్‌గా, చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ముంబయి హీరోస్ ఢీలా పడిపోయారు. ప్రస్తుత సీజన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) నాకవుట్ పోటీలు శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు రెండు సెమీస్‌లు జరిగాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన తొలి సెమీస్‌లో ముంబయి హీరోస్‌తో భోజ్‌పురి దబాంగ్ జట్టు తలపడింది. టాస్ గెలిచిన దబాంగ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో హీరోస్ ఆటకు దిగారు.
టీ–20 మ్యాచ్ అయినా పదేసి ఓవర్లతో రెండు ఇన్నింగ్స్‌గా సాగింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. సమీర్ 34 పరుగులు చేశాడు. ప్రతిగా దబాంగ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు వెనుకబడింది. ప్రవేశ్ 21 పరుగులు చేశాడు. కెప్టెన్ మనోజ్ తివారి 12 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. ఇక హీరోస్ రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే మరో రెండు బంతులుండగానే ఆలౌట్ అయింది. 92 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దబాంగ్ జట్టు చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరికి దబాంగ్ జట్టు హీరోస్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన రెండో సెమీస్‌లో వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బుల్డోజర్స్ తొలి ఇన్నింగ్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. కర్నాటక బుల్డోజర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. 103 పరుగుల లక్ష్యంతో తెలుగు వారియర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. నమస్తే వైజాగ్ అంటూ విశ్వక్‌సేన్ అభిమానులకు విషెస్ చెప్పాడు. ధమ్కీ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరాడు.