భలే ముంచి ఇసుక వేలము! | - | Sakshi
Sakshi News home page

భలే ముంచి ఇసుక వేలము!

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

రాజకీయ ఒత్తిళ్లతోనే వేలం

యాలాల: తహసీల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి తీరు ‘అంతా నా ఇష్టం’ అనే తరహాలో సాగుతోంది. డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు సెక్షన్‌ అధికారులకు సైతం కనీస సమాచారం లేకుండా సీజ్‌ చేసిన భారీ ఇసుక డంపును ఎలాంటి ప్రకటన లేకుండానే వేలం వేయించారు. తక్కువ ధరకే వేలం పూర్తయ్యేలా చక్రం తిప్పి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. శనివారం ఇసుక తరలింపు నేపథ్యంలో ఈ వ్యవహారం బయటకు పొక్కి, చర్చనీయాంశమైంది.

వేలం.. మమ!

మండలంలో కాకరవేణి, కాగ్నా నది ఉండటంతో రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. ఈక్రమంలో పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్లను పీఎస్‌కు తరలించేవారు. ఆతర్వాత చట్టరీత్యా చర్యలు తీసుకుని, ఇసుకను ఆవరణలో అన్‌లోడ్‌ చేయించేవారు. ఇలా ఏడాదిన్నరగా సుమారు 120 ట్రాక్టర్లకు పైగా పేరుకుపోయిన ఇసుకతో భారీ డంప్‌ ఏర్పడింది. ఇలా సీజ్‌ చేసిన ఇసుకను గతంలో పత్రికల్లో బహిరంగ వేలం ప్రకటన ఇచ్చి, అందరి సమక్షంలో పాట నిర్వహించేవారు. ఎక్కువ మొత్తంలో పాడిన వ్యక్తికి తరలింపు పర్మిషన్‌ ఇచ్చేవారు. కానీ ఈసారి ఇవేవీ లేకుండానే ఆర్‌ఐగా పనిచేస్తున్న అధికారి వేలం నిర్వహించినట్లు పేపర్లు రాసి, తనకు అనుకూలంగా మార్చుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వేలం ఎప్పుడు నిర్వహించారు.. ఎందరు పాల్గొన్నారు..? అనే వివరాలు అడిగినా చెప్పకపోవడం వీటికి బలం చేకూరుస్తోంది.

టిప్పర్లలో తరలింపు

ఈ నెల 11న తహసీల్దార్‌ కార్యాలయంలో శ్రీఅంతర్గత వేలంశ్రీ నిర్వహించగా మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రూ.36 వేలకే డంపును దక్కించుకున్నారు. యాలాల నుంచి కొడంగల్‌కు ట్రాక్టర్లలో రెండు రోజుల పాటు ఇసుక తరలింపుకు అవకాశం ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు అమనుతి పత్రాలు జారీ చేశారు. డంపులోని ఇసుకను కొడంగల్‌ పట్టణంలో చేపడుతున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి తరలిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.లక్షల విలువైన ఇసుకను కేవలం 60 ట్రాక్టర్ల ఇసుకగా పేర్కొనడంతో పాటు కేవలం రూ.36 వేలకే వేలం పాట పూర్తవడం, సదరు అధికారి ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా మారింది. ఇసుక తరలింపుకు ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వగా.. తమ బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో పీఎస్‌ ఆవరణ నుంచి భారీ టిప్పర్లలో ఇసుకను తరలించారు. సుమారు రూ.6 లక్షల విలువ చేసే ఇసుకను రూ.36 వేలకు కట్టబెట్టడం వినేవారికి విస్మయం కలిగిస్తోంది.

ఇసుకనూ బుక్కేశాడు..!

సాధారణంగా ఇసుక తరలింపునకు సెక్షన్‌ అధికారులు, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ సంతకాలతో కూడిన పత్రాలతో పర్మిషన్‌ జారీ చేస్తారు. కానీ ఇక్కడ ఇవేవీ లేకుండా ఆర్‌ఐతో పాటు తహసీల్దార్‌ సంతకాలతో అనుమతులు ఇచ్చేశారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌తో పాటు ఇతర సెక్షన్‌ అధికారులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో ‘ముడుపులు’ చేతులు మారాయనే ప్రచారం మొదలైంది. ఆమ్యామ్యాలతో పాటు సదరు అధికారి తనకు ఒక టిప్పర్‌ ఇసుక కావాలని డిమాండ్‌ చేసి, బహిరంగ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

సుమారు 120 ట్రిప్పులకు రూ.36 వేలే

వేలంతో చక్రంతిప్పిన ఆర్‌ఐ

నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్‌, తరలింపు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పీఎస్‌ ఆవరణలో భారీ మొత్తంలో సీజ్‌ చేసిన ఇసుక విషయంలోరాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేలం నిర్వహించాల్సి వచ్చింది. కొడంగల్‌లో చేపట్టిన ఆలయ నిర్మాణానికి ఇసుక అవసరమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇందులో భాగంగా వేలం ప్రక్రియ బాధ్యతను ఆర్‌ఐకి అప్పగించా. వేలం పాట నిర్వహించామని చెప్పడంతో ఇసుక తరలింపుకు అనుమతి ఇచ్చా. పత్రిక ప్రకటన లేకుండా వేలం పాట జరిగిందనే విషయం నాకు తెలియదు. – గాయత్రి, తహసీల్దార్‌, యాలాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement