అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

అనంతగిరి: నీట్‌ పరీక్ష పునఃనిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సంబంధితశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. ఆదివారం నీట్‌ పరీక్ష నేపథ్యంలో శనివారం ఆయన ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి నీట్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, ట్రెయినీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టుర్‌, డీఎస్పీ అంజయ్య, సిటీ కో ఆర్డినేటర్‌ సాయి లత, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, నెమతి హాలీ సంబంధిత శాఖల అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

‘వన మహోత్సవం’ విజయవంతం చేద్దాం

వన మహోత్సవం కార్యక్రమం విజయవంతానికి శాఖల వారీగా కేటాయించిన టార్గెట్‌పూర్తి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో వన మహోత్సవం–2026 ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, హరిత విస్తీర్ణం పెంపు, భూగర్భ జలాల సంరక్షణకు మొక్కల పెంపకం అత్యంత అవసరమన్నారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, విద్య, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌, నీటి సరఫరా తదితర శాఖలు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రహదారి పక్క ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి అధికారులు రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రతీరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మెడికల్‌ అధికారులతో మాట్లాడి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌కు సంబంధించిన రిపోర్ట్‌ అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమా శంకర్‌ ప్రసాద్‌, వెంకటాచారి, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, డీఆర్‌ఓ స్వర్ణలత, ఎంపీడీలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు జూమ్‌ ద్వారా కనెక్ట్‌అయ్యారు.

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement