అనంతగిరి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కొన్ని రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ఎంతవరకు సమంజమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం అమ్ముడు పోక, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని కోరారు. తడిసిన ఉత్పత్తులను తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్రాలు రైతులను మోసం చేస్తున్నాయని, వారి పక్షాన పోరాడతామని చెప్పారు. రైతులకు అవసరమయిన యూరియా, డీఏపీ, ఎరువులకు కొరత లేకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, కౌన్సిలర్ అశోక్‌కుమార్, సీనియర్ నాయకులు అశోక్, సుభాన్‌రెడ్డి, నరసింహ, అనిల్, షఫీ, నగేష్, గిరీష్ కొఠారి తదితరులు పాల్గొన్నారు.


