వికారాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కనుమరుగుకానుంది. ఈ నెలాఖరుతో కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి చరమగీతం పాడనుంది. ఎంజీ నరేగా స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వీబీజీరామ్ జీ(వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివికా మిషన్) వికసిత్ బారత్–వీ రామ్‌జీ పథకం అమలు చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ కొత్త పథకం అధికారికంగా ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా డీఆర్డీఏ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. 20 ఏళ్ల క్రితం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరుతో ఉపాధి హామీ పనులకు చట్టబద్ధత కల్పించగా 2006 ఉగాది నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2025లో పథకం పేరుతో పాటు ప్రాధమ్యాలు మారుస్తూ వీబీజీరామ్‌జీ పేరిట పార్లమెంటులో నూతన చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2026 జూలై 1వ, తేదీ నుంచి అమలులోకి రానుంది. ఉపాధి కల్పించేందుకు కుటుంబాలకు ఇచ్చిన జాబ్ కార్డులను డిజిటలైజేషన్ చేయటంతో పాటు పాత కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నారు. కార్డులు మాత్రం అవే కొనసాగించటంతో పాటు అవసరమైన వారికి కొత్త కార్డులు సైతం అందజేయనున్నట్లు సబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులుండగా ఇందులో 3,77,087 మంది కూలీలు ఉన్నారు.
పథకంలో ప్రధాన మార్పులు
● జాబ్‌కార్డున్న ప్రతీ కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించాలనే నిబంధన ఉండేది. పనికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం పని కల్పించని పక్షంలో పరిహారం చెల్లించాలనే నిబంధన ఉండేది.
● నూతన చట్టంలో పని దినాలను 125 రోజులకు పెంచారు.
● గతంలో కేంద్ర ప్రభుత్వమే ఉపాధి పనులకు వందశాతం నిధులు కేటాయించగా.. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్‌పై భారం పడే అవకాశం ఉంది.
● గతంలో 263 రకాల పనులు చేసేందుకు వీలుండగా ప్రస్తుతం ఆ పనులను 318కి పెంచారు. గంపగుత్తగా చేసే పనులకు స్వస్తి పలికారు.
● నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉండే చెరువుల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకంలో చేసేందుకు వీలుండేది. ప్రస్తుతం ఆ నిర్వహణ ఖర్చులు రాష్ట్ర నీటిపారుదల శాఖ భరించాల్సి ఉంటుంది. చెరువుల కాల్వల పూడికతీతకు మాత్రం కొత్త పథకంలో అవకాశం కల్పించారు.
● భూ అభివృద్ధి పనులు చేయించేందుకు వీలు లేదు.
● ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేల ఎకరాల భూములు అభివృద్ధికి నోచుకుండా ఉన్న నేపథ్యంలో భూ అభివృద్ధికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. నూర్పిడుల సమయంలో కల్లాలు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించాలని అభిప్రాయపడుతున్నారు.
● ఈ పథకం అమలులో ఏడాదిలో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకు 60 రోజులు పనులు చేపట్టకుండా గ్యాప్ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
ప్రాధామ్యాలివే..
● పథకంలో పలు మార్పులు చేపట్టడంతో పాటు నాలుగు ప్రధాన అంశాలను పథకం ప్రాధమ్యాలుగా ఎంచుకున్నారు.
● భూగర్భజలాల అభివృద్ధి, నీటి సంరక్షణ అంశాలకు పెద్దపీట.
● వాతావరణ మార్పులను ఎదుర్కునేందుకు మొక్కలు నాటడం తదితర అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
● గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాఽధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
● దీర్ఘకాలిక ఆస్తులను సృష్టించం ఈ పథకంలో నాల్గవ ప్రాధాన్యతా అంశంగా పొందుపర్చారు.
● 164 రకాల వ్యవసాయ సంబంధిత పనులు చేపట్టాలని పొందుపర్చారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, బస్ షెల్టర్ల లాంటి నిర్మాణాత్మక పనులను ఇందులో భాగం చేశారు.
జూలై 1 నుంచివీబీజీ రామ్‌జీగా అమలు
వంద రోజుల పనిదినాలు 125 రోజులకు పెంపు
263 నుంచి 318కి పెరగనున్న పనుల సంఖ్య
జాబ్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు
నూతన పథకం అమలుకు డీఆర్డీఏ అధికారుల కసరత్తు


