తాండూరు టౌన్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం అన్నారు. ప్రధానిగా మోదీ 12ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్టీ నాయకులు తాండూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. స్టేషన్ మాస్టర్, మేనేజర్‌లను కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. అనంతరం మోదీ పుష్కరకాలం పాలన, అభివృద్ధి వివరాల కరపత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, భద్రేశ్వర్, కిరణ్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, శ్రీకాంత్, ప్రభాకర్ గౌడ్, బబ్లూ, సాయిలు, సోమశేఖర్ పాల్గొన్నారు.
అప్పుల బాధ తాళలేక రియల్ వ్యాపారి బలవన్మరణం
దోమ: అప్పుల బాధ తాళలేక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ ఠాణా పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి చెందిన శేరి రాంరెడ్డి(35)కి 2011లో పూడూరు మండలం మన్నెగూడకు చెందిన అశ్వినితో వివాహమైంది. నాటి నుంచి ఆయన అక్కడే ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన ఆయన మన్నెగూడకు చెందిన బిజ్జి పద్మ, వసీం, హరిజన్‌రాజు, అజీవ్, మోసిన్, సల్మాన్‌ఖాన్ వద్ద అప్పుతీసుకున్నాడు. ఈ క్రమంలో అప్పులకు వడ్డీలు తోడయ్యాయి. అప్పు ఇచ్చిన వారి వేధింపులతో తన పేరిట ఉన్న 2.14 ఎకరాల భూమిని సల్మాన్‌ఖాన్‌పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగిలిన డబ్బు సైతం ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో అది తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలనీలో పాము కలకలం
పరిగి: పట్టణ కేంద్రంలోని తిరుమల కాలనీలో శుక్రవారం రాత్రి నాగు పాము హడలెత్తించింది. ఓ కిరాణ దుకాణంలోకి వెళ్లేందుకు పాము యత్నించింది. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా.. వారు సర్పాన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
జీఆర్‌సీ సెంటర్ ప్రారంభం
తాండూరు రూరల్: తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం జెండర్ రీసోర్స్ సెంటర్ (జీఆర్‌సీ)ను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేదింపులు, గృహహింస, బాల్య వివాహాలు, కలిగే నష్టాల గురించి ఈ వేదిక ద్వారా అతివలకు కౌన్సెలింగ్ ఇవ్వను న్నామని చెప్పారు. ఇందులో తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏపీఏం బాలప్పలు పాల్గొన్నారు.
అదనంగా బస్సు
నడిపించాలి
కొడంగల్ రూరల్: మండల పరిధి గుండ్లకుంట వయా హుస్సేన్‌పూర్, పెద్దనందిగామ, నీటూర్, నర్సాపూర్, కౌడీడ్‌ల మీదుగా కొడంగల్‌కు ఆర్టీసీ బస్సును నడిపించాలని తాండూరు డిపో అధికారులకు శనివారం పెద్దనందిగామ సర్పంచ్ చన్‌బస్‌కుమార్, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి వినతిపత్రం అందించారు. పాఠశాల సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం సర్వీసును తిప్పాలని పేర్కొన్నారు. ఇందులో సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.


