● వరుణుడి కోసం రైతుల ఎదురు చూపు
● మొక్కలను దక్కించుకునేందుకు పాట్లు
తాండూరు: వానాకాలం సాగు ఈ సారైనా కలిసొస్తుందని కోటి ఆశలతో సాగుకు సిద్ధమైన కర్షకులకు కష్టాలే ఎదురవుతున్నాయి. తొలుత చినుకు కురిపించి మురిపించిన వరుణుడు.. తరువాత ముఖం చాటేయడంతో వర్షాధార పంటలపై ఆధార పడిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. కంది, పత్తి తదితర విత్తనాలు విత్తారు. కాస్తోకూస్తో అక్కడ మొలిచిన మొలకలను కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బోరుబావులకు స్ప్రింక్లర్లను అనుసంధానం చేసి పొలాలకు నీటిని అందిస్తున్నారు. ఆ సౌకర్యం లేని రైతులు స్వయంగా మొక్కలకు నీరు అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, మరో రెండు మూడు రోజులు వర్షం కురవక పోతే మొక్క దశలోనే పంట ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.


