ఫలితం ఏముంది! | - | Sakshi
Sakshi News home page

ఫలితం ఏముంది!

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

వికారాబాద్‌: గతంతో పోలిస్తే జిల్లా విద్యాశాఖ ఈ సారి కాస్త మెరుగైన ఫలితాలు సాధించగా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతోంది. సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో మానవ వనరుల అభివృద్ధిలో కీలక భూమిక పోషించే విద్యాభివృద్ధి పరిస్థితి మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇంకా వెనుకబాటులోనే ఉంది. గడిచిన ఐదేళ్ల పలితాలను విశ్లేషిస్తే ఫలితాల పరంగా అట్టడుగునే ఉండగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మాత్రం మెరుగవుతోంది. ఫలితాల్లో వెనకబాటుకు గురైన సమయంలోనే మొక్కుబడిగా ఈ విషయం చర్చకు వస్తుందే తప్ప విద్య అనేది ప్రాధమ్యాల్లో ఒకటిగా ఉండటంలేదు. ప్రభుత్వాలు సైతం మౌలిక సదుపాయాల మీద కేంద్రీకరిస్తున్న దృష్టి విద్య, విద్యా ప్రమాణాల విషయంలో కనిపించడంలేదు. ఫలితాల్లో వెనకబడిన ప్రతిసారి జిల్లా విద్యాధికారిని లేదంటే ఆ పాఠ శాల హెచ్‌ఎంను బాధ్యులు చేస్తున్నారు తప్పితే మూలాలను పరిగనలోకి తీసుకుని విశ్లేషించడంలేదనేది విశ్లేషకుల భావన. రాష్ట్ర చివరి అంచుల్లో ఉన్న ములుగు జిల్లా ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిస్తే రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న సీఎంగా, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి జిల్లా మాత్రం అట్టడుగున నిలుస్తోంది. జిల్లాకు చెందిన దోమ, కుల్కచర్ల, దుద్యాల, బొంరాస్‌పేట, బంట్వారం లాంటి మండలాలు అక్షరాస్యతా విషయంలో జాతీయ స్థాయి కంటే అట్టడుగున ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న జిల్లాలో ఫలితాల పెంపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు లేకుండా ఒక్కసారిగా టాప్‌లో నిలవాలని ఆశించటం కూడా సరికాదు.

మూడేళ్లుగా అట్టడుగునే..

విద్యార్థులు పాశాలలో చేరింది మొదలు వారి ప్రతిభను గుర్తించే మొదటి బోర్డు ఎగ్జామ్‌ 10వ తరగతి మాత్రమే. టెన్త్‌ ఫలితాల్లో గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో అట్టడుగు స్థానం(33)లోనే నిలిచాం.అయినా మన జిల్లా నేతలకు , ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టు లేదు. ఫలితాల్లో అట్టడుగున ఉంటున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కనీసం అధికారులను సమావేశమై రివ్యూ చేసిన దాఖలాలు లేవు. వెనుకబాటుకు మూలాలను అన్వేశించిన పాపాన పోలేదు. ఫలితాలు మెరుగయ్యేందుకు జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సపోర్టు అవసరమో కనీసం తెలుసుకోలేదు. రోడ్లు, చెట్టు, మొక్కలు, పొలాలు, భూములు, భవనాలు ఇలాంటివాటన్నింటి గురించి సమీక్షలు చేసే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మన భావిభారత పౌరులు, జిల్లా భవిషత్‌ అయిన చిన్నారుల గురించి సమీక్షలు చేయడంలేదు.

35 జెడ్పీహెచ్‌ఎస్‌లలో వందశాతం ఉత్తీర్ణత

గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారనే చెప్పాలి. జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతానికి పైగా పాఠశాలల్లో తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 85 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 85లో 35 జెడ్పీహెచ్‌ఎస్‌లే. జిల్లా వ్యాప్తంగా 53 ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వంద శాతం రిజల్టు సాధించడం సానుకూలాంశం. జిల్లా లో 13,482 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 91.25 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. 1,180 మంది విద్యార్థులు ఫెయిల్‌ అవ్వగా 589 మంది విద్యార్థులు సైన్స్‌, 342 మంది గణితంలో అనుత్తీర్ణులయ్యాయరు. ఈ రెండు సబ్జెక్టులను మెరుగుపర్చుకుంటే రిజల్టు 95 శాతానికి పైకి ఎగబాగే అవకాశం ఉంది. విద్యాశాఖ ఈ విషయాలను గుర్తించి ఫోకస్‌ చేస్తే మన జిల్లా టాప్‌టెన్‌లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని స్పష్టమవుతోంది.

పదోతరగతి ఫలితాల్లోమళ్లీ వెనుకబాటే..

ఉత్తీర్ణత పెరిగినా.. మెరుగుపడని స్థానం

విద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్ర స్థాయి స్థానం

2021–22 90.42 24వ

2022–23 59.5 33వ

2023–24 64.8 33వ

2024–25 73.6 33వ

2025–26 91.25 31వ

Advertisement
 
Advertisement
Advertisement