చికిత్స కోసం వస్తే చితకబాదారు | - | Sakshi
Sakshi News home page

చికిత్స కోసం వస్తే చితకబాదారు

Mar 28 2026 10:38 AM | Updated on Mar 28 2026 10:38 AM

● రోగి తండ్రిపై బాలాజీ ఆస్పత్రిసిబ్బంది దౌర్జన్యం ● గదిలో బంధించి దాడి

పరిగి: కుమారుడి వైద్యం కోసం వెళ్లిన ఓ తండ్రిపై ఆస్పత్రి యాజమాన్యం దాడి చేసింది. ఈ ఘటన పరిగి పట్టణంలోని బాలాజీ హాస్పిటల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సయ్యద్‌పల్లికి చెందిన నవీన్‌ కుమారుడు నిహాన్ష్‌ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఈ నెల 19న చికిత్స నిమిత్తం పరిగి పట్టణంలోని బాలాజీ ఆస్పత్రికి వచ్చారు. నిహాన్ష్‌ను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందని అడ్మిట్‌ చేసుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి పంపారు. శుక్రవారం చికిత్స నిమిత్తం మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. టోకెన్‌ తీసుకొని లైన్‌లో ఉండగా నిహాన్ష్‌కి మూడు సార్లు వాంతులు అయ్యాయి. దీంతో తండ్రి నవీన్‌ డాక్టర్‌ వద్దకు పంపాలని అక్కడి సిబ్బందిని కోరాడు. వాళ్లు నిరాకరించారు. మెడికల్‌ షాపులో ఉన్న యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాడు. మేము మందులు ఇస్తాము లైన్‌లోనే వెళ్లాలని వారు సూచించారు. దీంతో బాధితులు.. యాజమాన్యం మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో రోగి తండ్రి నవీన్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఈడ్చుకెళ్లి రూమ్‌లో బంధించి చితకబాదారు. బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు. దీంతో నవీన్‌ గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వారు ఆస్పత్రికి చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తమపై దాడి చేసిన ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement