రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Mar 28 2026 10:33 AM | Updated on Mar 28 2026 10:33 AM

దోమ: కేసుల సత్వర పరిష్కారానికి చక్కటి వేదిక లోక్‌ అదాలత్‌. కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా కోర్టులు చొరవ చూపుతాయి. పై కోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి వీలులేని విధంగా పరిష్కారం దొరుకుతుంది. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా సత్వర న్యాయం పొందవచ్చు. లోక్‌ అదాలత్‌లో మోటారు వెహికల్‌, ఆబ్కారీ కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ తగాదాలు, చీటింగ్‌ కేసులు, యాక్సిడెంట్‌ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చు. నేడు(శనివారం) పరిగి, కొడంగల్‌ పట్టణాల్లోని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులు, కక్షిదారులకు ఆయన సూచించారు.

లోక్‌ అదాలత్‌ అంటే ఏమిటి?

చట్టంలో అవగాహణ లేని విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి లోక్‌ అదాలత్‌(పీపుల్స్‌ కోర్టు). కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో వాటి పరిష్కారం కోసం ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్‌ అదాలత్‌ అనేది లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ యాక్ట్‌ – 1987 ప్రకారం చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది.

ఎలాంటి ఫీజు లేదు

పెండింగ్‌ కేసులు లేదా న్యాయస్థానంలో ప్రీ – లిటిగేషన్‌ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్‌ అదాలత్‌. ఈ చట్టం ప్రకారం ఇచ్చే అవార్డు(నిర్ణయం) సివిల్‌ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులను మాత్రమే పరిష్కరించుకోవచ్చు. ఆ సంస్థ ఇచ్చే తీర్పు అంతిమం. కేసులు పరిష్కారమైనప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీలు చేయడానికి అవకాశం ఉండదు. లోక్‌ అదాలత్‌ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. లోక్‌ అదాలత్‌ కేసులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

సత్వర న్యాయానికి చక్కటి వేదిక

పై కోర్టుల్లో అప్పీలు లేకుండానే కేసుల పరిష్కారానికి కృషి

కక్షిదారులతో రాజీ కుదుర్చుకునేందుకు మంచి అవకాశం

ఖర్చు లేకుండా..

లోక్‌ అదాలత్‌లో రాజీ పడేవారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. మండలంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఇరువర్గాలు ముందుకు రావాలని ఇప్పటికే సూచించాం. ఏమైనా సందేహాలు ఉంటే సెల్‌ నంబర్‌ 8712670043లో సంప్రదించాలి.

– వడ్త్య వసంత్‌జాదవ్‌, ఎస్‌ఐ, దోమ

రాజీ చేసుకోవాలి

పరిగి కోర్టులో నేడు జరిగే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి. మోటారు వెహికల్‌, ఆబ్కారీ, బ్యాంకు రుణాల కేసులు, కుటుంబ, భూ తగాదాలు, చీటింగ్‌, యాక్సిడెంట్‌ కేసులను రాజీ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 8712670016లో సంప్రదించాలి.

– శ్రీనివాస్‌, డీఎస్పీ, పరిగి

మండలాల వారీగా రాజీకి అవకాశం ఉన్న కేసులు ఇలా..

పరిగి 50

దోమ 30

కుల్కచర్ల 40

చన్గోముల్‌ 55

కొడంగల్‌ 50

దౌల్తాబాద్‌ 35

బొంరాస్‌పేట్‌ 40

దుద్యాల్‌ 16

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement