తాళం వేసిన ఏడు ఇళ్లలో చోరీ
సీసీ టీవీ ఫుటేజీలో దొంగలు
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు
తాండూరు రూరల్: మండలంలోని చింతమణి0పట్నం గ్రామంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసిన ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. నగదు, బంగారం, వెండి అపహరించారు. బైక్‌పై వచ్చిన దొంగలు మూతికి మాస్క్‌లు ధరించినట్లు సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సందర్శించి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ వినోథ్ రాథోడ్, బాధితుల కథనం మేరకు.. గ్రామ శివారులో గోవర్ధన్‌రెడ్డికి చెందిన కిరాణా దుకాణం ఉంది. దొంగలు షాపు తాళం పగులగొట్టి ఫ్రిడ్జ్‌లోని బీర్లు తాగారు. ఆ తర్వాత కుర్వ పెద్ద మల్లప్ప, కుర్వ చిన్న మల్లప్ప, కప్పలి లాలమ్మ ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం గౌడి విజయమ్మ ఇంట్లో వెండి అపహరించారు. బొంబాయి రామామ్మ, హరిజన్ వెంకటప్ప, జీవికొండ లక్ష్మప్ప ఇళ్ల తాళాలు విరగొట్టి వస్తువులు చిందరవందరగా పడేశారు. గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో రూ.7 వేల నగదు, హరిజన్ వెంకటమ్మ ఇంట్లో అర తులం బంగారం ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేశారు.


