పేదలకు అండగా కాంగ్రెస్
కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు
కుల్కచర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ముజాహిద్‌పూర్ గ్రామంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, భీమయ్య, శ్రీను, రమేశ్, రాజు పాల్గొన్నారు.
మురుగు తొలగించాలని వినతి
తాండూరు రూరల్: మండల పరిధిలోని వీర్‌శెట్టిపల్లి మార్గంలో మురుగుతొలగించాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పట్టణంలో మున్సిపల్ కమిషననర్ యాదగిరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని పాత తాండూరు మీదగా వీర్‌శెట్టిపల్లికి వెళ్లే మార్గంలో మురుగు చేరి వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్, గోనూర్ గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారని శ్రీహరి చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉపసర్పంచ్ జర్నప్ప, నాయకులు ఎర్ర శ్రీనివాస్ ఉన్నారు.
బాల కార్మికులకు విముక్తి
శంకర్‌పల్లి: భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న ఆరుగురి బాలలకి పోలీసులు విముక్తి కల్పించిన సంఘటన మంగళవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ ముస్కాన్, మోకిల పోలీసులు సంయుక్తంగా బాల కార్మికుల కోసం తనిఖీలు చేశారు. మోకిల గ్రామ పరిధిలోని పలు భవన నిర్మాణ కంపెనీలలో పని చేస్తున్న ఆరుగురు బాలలని గుర్తించి, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న సదరు కంపెనీల యాజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
యజమానులపై కేసు నమోదు
కేశంపేట: మండల పరిధిలో ఇద్దరు బాల కార్మికులకు పోలీసులు మంగళవారం విముక్తి కలిగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని బోధునంపల్లి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు చేసి ఓ బాలుడికి పనుల నుంచి విముక్తి కలిగించారు. అలాగే మంగళిగూడ గ్రామ శివారులోని ఇటుక బట్టీలో పని చేస్తున్న ఇద్దరు బాలురకు విముక్తి కలిగించారు. అనంతరం ఇద్దరు యజమానుల పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. బాల కార్మికులను పనులకు పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు
కేశంపేట: వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి మహిళ కింద పడిన సంఘటనలో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని మురళీనగర్‌కు చెందిన స్వప్న తన ఇద్దరు పిల్లలతో షాద్‌నగర్‌కు వెళ్లేందుకు ఈ నెల 18న కేశంపేట వద్ద బస్టాండ్ వద్ద వేచి ఉంది. ఆమనగల్లు నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో చేతికి గాయాలైనట్లు బాధితురాలి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
చేవెళ్ల: ఎదురుగా వస్తున్న డీసీఎం, స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు బస్టాప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన విశ్వకర్మ అభిషేక్(23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో స్కూటీపై హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో మండలంలోని ఆలూరు బస్టాప్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అభిషేక్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్


