రచ్చకెక్కిన ‘పంచాయితీ’
● వ్యతిరేకంగా పనిచేశావంటూ ఫ్లెక్సీ చించివేత
● పరిస్థితిని చక్కదిద్దిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఆరోపిస్తూ.. ఓ నేత అక్కడి ఫ్లెక్సీలో ఉన్న మరో నాయకుడి చిత్రాన్ని తొలగించగా.. ఎందుకు అలా చేశావంటూ సదరు నేత ప్రశ్నించాడు. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోగా.. ఇరు వర్గాల గులాబీ శ్రేణులుకల్పించుకొని మరింత ఆజ్యం పోశారు. పరిస్థితి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దృష్టికి వెళ్లగా.. ఇరువురితో మాట్లాడి సయోధ్య కుదిర్చి, పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలు ఇలా ఉన్నాయి.
స్పీకర్‌ను కలిసేందుకు వచ్చి..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మదన్‌పల్లి సర్పంచ్‌గా రాజశేఖర్‌రెడ్డి తల్లి విజయలక్ష్మి విజయం సాధించగా.. వారంతా సోమవారం కార్యాలయంలో స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. కాగా.. అక్కడ ఉన్న పలు ఫ్లెక్సీల్లో సుధాకర్‌రెడ్డి చిత్రంఉండగా.. గమనించిన పలువురు మా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశావంటూ ఆగ్రహిస్తూ.. ఆయన చిత్రాన్ని తొలగించారు. దీంతో గందరగోళం నెలకొంది. కొద్దిసేపటికీ స్పీకర్ అక్కడికి చేరుకున్నారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆయనను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల్లో తన బొమ్మను తొలగించారనే విషయం సుధాకర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు తెలియగా.. వారు అక్కడికి చేరుకున్నారు. ఎందుకిలా చేశావంటూ రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ ఇలా వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. దీంతో ఇరువురి వాగ్వివాదం చేసుకోగా.. స్పీకర్ కల్పించుకుని వారిద్దరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.


