కారు బేజారు!
బషీరాబాద్, బంట్వారంలో బలమైన పోటీ మలి విడతలో వికసించిన కమలం, సత్తా చాటిన స్వతంత్రులు మెజార్టీ మండలాల్లో హస్తం హవా
పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించినా.. అభ్యర్థుల వెంట ఉండేది మాత్రం పార్టీలే. ఇప్పటికే రెండు విడతల ఎలక్షన్స్ పూర్తవగా.. ఫలితాల్లో అధికార పార్టీ ఆధిపత్యం కొనసాగింది. నదీ ప్రవాహంలా సాగిన గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. కమలం తొలి, మలి విడతల్లో పదిస్థానాలకు పరిమితవగా స్వతంత్రులు 31 పంచాయతీల్లో పంతం నెగ్గించుకున్నారు.
వికారాబాద్: స్థానిక సమరంలో కారు డీలా పడింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు పై ‘చేయి’సాధించగా కొన్ని మండలాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు సైతం గట్టి పోటీనే ఇచ్చారు. రెండవ విడతలో మాత్రం బీఆర్‌ఎస్ నేతల పోటీ నామమాత్రంగా మారింది. మొదటి విడతలో తాండూరు మాజీ ఎమ్మెల్యే సొంత మండలం బషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. మిగిలిన ఏడు మండలాల్లో గులాబీ పార్టీ నామమాత్రపు పోటీతో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవాకొనసాగగా.. ఇద్దరు స్వ తంత్రులు గెలుపొందారు. కారు పార్టీ ఖాతా తెరవలేకపోయింది. రెండవ విడతలో బంట్వారం మండలంలో ఒకింత పోటీ ఇవ్వగా మిగిలిన మండలా ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. బీజేపీ మొదటి విడతలో రెండు స్థానాల్లో గెలుపొందగా.. ఎనిమిది గ్రామాల్లో కమలం వికసించింది. స్వంతంత్రులు బీజేపీకి మూడింతల స్థానాలతో 31 చోట్ల సత్తా చాటారు. వామపక్ష పార్టీ ప్రాభవం కరువైంది.
ముఖ్య నేతలపై కేడర్ గుస్సా
పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని గ్రామ, మండల స్థాయి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేతలు మొహం చాటేయడంపై మండిపడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద నుంచి 150 వరకు పంచాయతీలుండగా ముఖ్య నేతలు పది, ఇరవై గ్రామాలను కూడా సందర్శించిన దాఖలాలు లేవు. పోటీలో ఉండి ఖర్చు చేసేందుకు స్థోమతలేని వారికి సైతం సహకరించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కొన్ని చోట్ల కేడర్‌కు అండగా నిలవగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కనీసం పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ కేడర్ ముఖ్య నేతలపై గుర్రుగా ఉన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చవి చూడటమే కాకుండా పదివార్డులు ప్రత్యర్థి వర్గానికే దక్కడం చర్చనీయాంశంగా మారింది.
స్వతంత్రులకు గాలం
రెండు విడతల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు సత్తా చా టారు. మొదటి విడతలో ఎనిమిది చోట్ల విజయం సాధించగా రెండ విడతలో 23 జీపీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీల్లో కలుపుకొనేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులను పురమాయించి స్వతంత్రులను తమ పార్టీల్లోకి వచ్చేలా చూడాలనే వ్యూహంతో ముందుకెళుతున్నారు. స్వతంత్రులుగా గెలిచిన వారిలో ఎక్కువ శాతం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి రెబల్‌గా పోటీ చేసిన వారే ఉన్నారు. గతంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ స్వతంత్రుల్లో ఎక్కువ శాతం అధికార పార్టీలో చేరే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రెండు విడతల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ డీలా
మొదటి, రెండు విడతల్లో పార్టీల వారీగా వివరాలు
మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
తాండూరు 33 22 11 – –
బషీరాబాద్ 39 21 17 01 –
యాలాల 39 23 12 01 03
పెద్దేముల్ 38 26 12 – –
కొడంగల్ 25 23 – – 02
దౌల్తాబాద్ 33 21 11 – 01
బొంరాస్‌పేట్ 35 29 05 – 01
దుద్యాల 20 15 04 – 01
వికారాబాద్ 21 13 01 01 06
ధారూరు 34 22 06 04 02
మోమిన్‌పేట్ 29 15 09 – 05
నవాబుపేట్ 32 23 04 02 03
బంట్వారం 12 04 04 – 04
మర్పలి 29 21 08 – –
కోట్‌పల్లి 18 11 03 01 03
మొత్తం 437 289 107 10 31


