ఎన్నికలు సమన్వయంతో పూర్తి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: మూడో విడత పోలింగ్‌లోనూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. సోమవారం అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి ఎన్నికలు జరగనున్న పరిగి, కుల్కచర్ల, పూడూరు, చౌడాపూర్, దోమ మండలాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓ, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామగ్రి ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. పోలింగ్ సెంటర్ల వారీగా నంబర్లు ప్రకారం ఉండాలన్నారు. పోలింగ్ అధికారులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ వేగవంతంగా పూర్తి చేసేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది ఉదయమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకుని మెటీరియల్స్ చెక్ చేసు కుని తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు పోలింగ్ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కి సంబందించిన రిపోర్ట్లన్నీ నిర్దేశిత సమయంలో ఫార్మాట్ ప్రకారం టీపోల్‌లో పొందుపరచాలన్నా రు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఆర్‌ఓ మంగీలాల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు తదితరులు ఉన్నారు.
సైలెన్స్ పీరియడ్ అమలు
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో మూడో విడత పరిగి, పూడూరు, కుల్కచర్ల, దోమ, చౌడాపూర్ మండలాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దన్నారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా, సంగీత,నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయొద్దన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


