ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్ జాగ్రత్త
శంకర్‌పల్లి: ప్రైవేటు బ్యాంకులు ప్రజలకు విరివిగా రుణాలిస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ ఇన్నోవేటివ్ హాబ్ సీఈఓ రాజేశ్ బన్సాల్ సూచించారు. దొంతాన్‌పల్లిలో ని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్యాంకింగ్ సదస్సుకు సోమవారం ఆయన, విశ్వవిద్యాలయ కులపతి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డా. సి. రంగరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్‌బీఐలో పనిచేసి, పదవీ విరమణ పొందిన నిపుణులు రాసిన పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మ్యూచువల్ ఫండ్ తదితర ఆర్థికపరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పురోభివృద్ధిని మారుస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. సదస్సులో ఇక్ఫాయ్ సొసైటీ చైర్‌పర్సన్ శోభా రాణి యశస్వి, ఉప కులపతి డా. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


