ఏకగ్రీవ వార్డు సభ్యుడి అనుమానాస్పద మృతి
మోమిన్‌పేట్: యునానిమస్ వార్డు మెంబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మక్తతండాలో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మెగావత్ రవి (45) శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రించి, తెల్లారేసరికి శవమయ్యాడు. మృతుడి ముక్కు, తలతో పాటు మర్మావయాలపై గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రవి తల్లి సక్కుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేసిన రవి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


