మృతదేహంతో ఆందోళన
హత్యేనని బాధితుల ఆరోపణ
కుల్కచర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన కుల్కచర్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌడాపూర్ గ్రామానికి చెందిన రత్నయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో అనిత సన్నిహితంగా ఉంటోందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రత్నయ్య మృతదేహాన్ని రామకృష్ణ ఇంటి ఎదుట ఉంచి, ఆందోళన నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రత్నయ్య మృతికి కారకులైన వారిని చట్టరీత్యా శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.


