బషీరా‘బాద్‌షా’ వెంకటేశ్ మహరాజే
బషీరాబాద్: జిల్లాలో ఉత్కంఠ రేపిన బషీరారాబాద్ సర్పంచ్ పీఠం మహరాజులకే దక్కింది. గురువారం జరిగిన పల్లె పోరులో తన సమీప ప్రత్యర్థి అనూప్ ప్రసాద్‌పై 370 ఓట్ల భారీ మెజార్టీతో వెంకటేష్ మహరాజ్ విజయం సాధించారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు నేతలు పోటీ పడడంతో పార్టీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మహరాజులకు మద్దతు తెలుపడం కాంగ్రెస్‌లో దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే వర్గం పూర్తిగా అనూప్ ప్రసాద్‌కు అండగా నిలిచింది. బీఆర్‌ఎస్, బీజేపీ మహరాజ్ కుటుంబానికి బాసటగా నిలిచాయి. దీంతో వెంకటేశ్ మహరాజు గెలుపొందారు.
ఐదో సర్పంచ్..
ఇప్పటి వరకు బషీరాబాద్ సర్పంచ్‌గా మహరాజుల ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నలుగురు నాయకులు సర్పంచులుగా సేవలు అందించారు. మొదటి సర్పంచ్‌గా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు తండ్రి నర్సప్ప మహరాజ్, ఆ తర్వాత అతని కొడుకు దివంగత మాజీ మంత్రి చంద్రశేఖర్‌మహరాజ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రాకేశ్ మహరాజ్ జెడ్పీటీసీగా, సర్పంచ్‌గా బషీరాబాద్ ప్రజలకు సేవచేశారు. తాజాగా ఇదే ఇంటి నుంచి చంద్రశేఖర్ మహరాజ్ సొంత అల్లుడు వెంకటేశ్ మహరాజ్ ఐదో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.


