ఏకగ్రీవ ఉప సర్పంచులు వీరే
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కుల్కచర్ల మండలంలో 4 గ్రామ పంచాయతీలు, చౌడాపూర్‌లో 6 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో బుధవారం ఉప సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉప సర్పంచులు..
తిర్మలాపూర్ ఉపసర్పంచ్ శివకుమార్, దాస్యనాయక్ తండాకు నూరిబాయి, బోట్యానాయక్ తండాకు కేతావత్ ప్రకాష్, ఎత్తుకాల్వ తండాకు జ్యోతి, వాల్యనాయక్ తండాకు రఘు రాథోడ్, కిష్టంపల్లికి రామచంద్రి, నీర్‌సాబ్ తండాకు చింగే నాయక్, లింగన్నపల్లికి యాదమ్మ, మక్తవెంకటాపూర్ కొర్ర లక్ష్మణ్‌లు ఏకగ్రీవం అయ్యారు.
‘న్యాయమే గెలిచింది’
అబ్దుల్లాపూర్‌మెట్: తప్పుడు ఆరోపణలతో తనపై పెట్టిన కేసులను న్యాయస్థానం కొట్టేసిందని పెద్ద అంబర్‌పేటకు చెందిన వ్యాపారవేత్త సామ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం పెద్దఅంబర్‌పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను నయీం పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు బీజేపీ జిల్లా నాయకుడు సామ రంగారెడ్డి 2016లో ఫిర్యాదు చేశారన్నారు. తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన ఈకేసులో నిజానిజాలను నిర్ధారించిన న్యాయస్థానం నిరాధారమైన కేసును కొట్టేసిందని తెలిపారు. తనను రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదుర్కోలేక కొంతమంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరికి న్యాయమే గెలిచిందని, కోర్టు తీర్పుతోనైనా ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు.
డివైడర్‌ను ఢీకొని
పల్టీ కొట్టిన కారు
మీర్‌పేట: వేగంగా వచ్చిన కారు డివైడర్‌కు ఢీకొని పల్టీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ కథనం ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన మొహిద్ సాహిల్(21) యాకుత్‌పురాకు చెందిన స్నేహితుడు సయ్యద్ సోఫ్యాన్ కారును తీసుకుని మంగళవారం అర్ధరాత్రి మరో మిత్రుడు హసన్‌తో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆర్‌సీఐ పాష్‌కాలనీ వద్దకు రాగానే సాహిల్ అతివేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హసన్‌కు తీవ్ర గాయాలు కాగా, కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ హసన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుతో
వలస కార్మికుడి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: పాము కాటుకు గురై ఓ వలస కార్మికుడు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ (50), పది రోజుల క్రితం బాచారంలోని ఓ వెంచర్ వద్ద లేబర్ పని చేసేందుకు వచ్చాడు. తోటి కార్మికులతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన అతన్ని పాము కాటేసింది. ఈ విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాసులుంటేనే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: అర్జెంటీనా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ‘గోట్’ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి పాస్ లేకుంటే అనుమతి లేదని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఈ నెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– మెస్సీతో ఉప్పల్ మైదానంలో మెస్సీ– గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం
అమీర్‌పేట: అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని షాప్ నెం.105లో గల శివమ్ టెక్నాలజీ, 106లోని రామ్‌దేవ్ సొల్యూషన్స్‌లో ఉదయం 8 గంటలకు పొగలు రావడంతో స్థానికులు గమనించిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన సనత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. అప్పటికే షాపు లలోని కంప్యూటర్లు, ఇతర పరికరాలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ పల్లే ప్రమా దం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.


